Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హర్యానాలో డేరా బాబా లాగా..ఏపీలో జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. డేరా బాబా ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించారని, జగన్ కూడా ఆయనలానే ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కాల్చాలి, ఉరితీయాలి అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన జగన్ ….తన లానే ప్రజలని కూడా తిట్టమని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని, అభివృద్ధికి నిరంతరం అడ్డుపడుతున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత నాగమల్లితోటలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం అంబేద్కర్ భవన్ లో మహిళా సంఘాలతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. మంచి పట్టణంగా తయారయ్యేందుకు కాకినాడలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. సెజ్ లలో పరిశ్రమలు వస్తే కాకినాడ దశ మారిపోతుందని, కాకినాడను స్మార్ట్ సిటీగా మారుస్తామని, చంద్రబాబు హామీ ఇచ్చారు. నగరాన్ని విద్యాకేంద్రంగా తయారుచేస్తామని, యువతకు స్థానికంగా ఉద్యోగాలు లభించేలా కృషిచేస్తామని తెలిపారు. కాకినాడలోని అన్ని స్థానాల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని, తమ పార్టీకి అండగా నిలబడాలని ప్రజలను కోరారు. కాకినాడను ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తానని, పునర్ వైభవం తీసుకొస్తామని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక పర్వం ముగియటంతో అధికార, ప్రతిపక్షాలు ఇక కాకినాడపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతలు కాకినాడలో కలియ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.