Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యక్తిగత ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులను నిందించడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరికైనా తల్లి, తండ్రి దైవంతో సమానమని, వారిని నిందించడం భారతీయ సంప్రదాయమా అని ప్రశ్నించారు. విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని, అలాంటి వాళ్లను ప్రధాని కార్యాలయం చేరదీస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం దేశం, ప్రపంచం అంతా టీడీపీనే గమనిస్తోందని, పార్టీ ఇమేజ్ ని దెబ్బతీసే చర్యలను సహించేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.
రహస్యంగా ఎవరితో మంతనాలు జరపవద్దని, తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని, ఎంపీల చర్యలను, వ్యాఖ్యలను అందరూ గమనిస్తున్నారని, ఇది ఐదు కోట్ల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడు తొందరపడనని, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయనని, జీవితంలో ఎన్నో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొని ఇంత స్థాయికి వచ్చానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల హక్కులను కాపాడడంలో వెనుకంజవేయబోనని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 6 వరకు అందరూ నల్లబ్యాడ్జిలు ధరించాలని నేతలకు సూచించారు. ఎవరికీ సొంత అజెండాలు ఉండకూడదని, ఐదు కోట్ల ప్రజల అజెండానే మన అజెండా కావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.