Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ కి దన్నుగా వుంటారనుకున్న నాయకులు ఒక్కసారిగా కాంగ్రెస్ కి జై కొట్టేసరికి టీటీడీపీ లో తీవ్ర అభద్రతా భావం వచ్చింది. అసలు తమకే కాదు పార్టీకి తెలంగాణాలో మనుగడ ఉంటుందా అన్న సందేహం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సమయంలో వారికి దిశానిర్దేశం చేయడానికి సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగేసరికి ఎక్కడో చిన్నపాటి భరోసా. అందుకే హైదరాబాద్ రావడం బాబుకి కొత్త కాకపోయినా ఈసారి తెలుగు తమ్ముళ్లు ఆయన మొదటి సారి వస్తున్నంత హడావిడి చేశారు. ఇలాంటి స్పందన ఊహించని బాబు కూడా శ్రేణుల ఉత్సాహం చూసి పొంగిపోయారు. పార్టీని నడిపించే సరైన నాయకత్వం ఉంటే చాలన్న ధీమా టీడీపీ కి కలిగించింది బాబు పర్యటన.
ఎప్పుడైనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి సంతోషం కలిగితే మాటలు తూటాలు అవుతాయి. విచారం ఉద్వేగం అవుతుంది. కష్టం ఉత్సాహం అవుతుంది. టీటీడీపీ శ్రేణుల్లోనూ అదే జరిగింది. భవిష్యత్ మీద ఏ ఆశ లేని ఆ నేతల్లో చంద్రబాబు తో సమావేశం కొత్త ఉత్సాహం తెచ్చింది. ఆ వూపులోనే బాబు నుంచి కూడా అదే తరహా స్పందన ఆశించారు నాయకులు. సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, కొత్తకోట దయాకర్ రెడ్డి ఓ అడుగు ముందుకెళ్లి టీటీడీపీ ఇకపై సమరం చేయాలా, శరణం కోరాలా అని నేరుగా బాబునే అడిగేశారు. అయితే బాబు వారికి గీతోపదేశం చేశారు.
“సమరం వద్దు . శరణం అవసరం లేదు. ప్రజలతో కలిసి పనిచేయండి. కేవలం ఎన్నికల దృష్టితో ఆలోచించొద్దు. ఇప్పటికిప్పుడు నేను తేల్చి చెప్పకపోతే మీకు అనుమానం రావొచ్చు. కానీ ముందే చెప్పి చేస్తే అది రాజకీయం కాదు. కనీసం చిన్న వ్యూహం కూడా కాదు. పరిస్థితిని బట్టి వ్యూహాలు ఉంటాయి. మీరు పని చేసుకుంటూ వెళ్లి వ్యూహాలు, రాజకీయ నిర్ణయాల సంగతి నాకు వదిలిపెట్టండి “ అని చంద్రబాబు చేసిన గీతోపదేశం తో నాయకులకి స్పష్టత రాలేదు. తెలంగాణాలో అధికార పార్టీ తెరాస, సీఎం కెసిఆర్ గురించి కానీ ఆయన మీద తొడ కొడుతూ టీడీపీ ని వదిలివెళ్లిన రేవంత్ మీద కానీ చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి వారి మీద కామెంట్స్ చేయలేదు. బాబు నుంచి ఈ తరహా గీతోపదేశాన్ని ఊహించని నాయకులు రాజకీయ వైఖరిలో స్పష్టత లేకుండా ఎలా అని మధన పడుతున్నారు. కానీ తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ప్రజల, పార్టీల నాడి తెలియకుండా తొందరపాటు నిర్ణయాలు తగవని బాబు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు హడావిడి నిర్ణయాలతో వచ్చే లాభం, తీసుకోకుంటే కొత్తగా వచ్చే నష్టం లేవని ఆయన భావన. మొత్తానికి రాజకీయ భవిష్యత్ మీద ఆందోళనతో వున్న తెలుగు తమ్ముళ్లు బాబు మనసు చదవలేకపోయారు.