Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాదాపు ఏడాది విరామం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. గంటపాటు ఈ భేటీ జరిగింది. విభజన బాధిత రాష్ట్ర అవసరాలు వివరిస్తూ చంద్రబాబు ప్రధానికి 17 పేజీల వినతిపత్రాన్ని అందించారు. పోలవరం, నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు సహా అనేక అంశాలపై సీఎం పీఎంతో చర్చించారు. ఈఏపీ నిధులతో పాటు 9,10 షెడ్యూల్స్ లోని సంస్థల విభజన అంశాలపై ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలుస్తోంది. శాసన సభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కు పెంచాలని చంద్రబాబు కోరారు. కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణం కోసం తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు.
పోలవరం ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని మొత్తం హామీఇచ్చినట్టుగా కేంద్రమే భరించాలని, పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటిని నెరవేర్చాలని కోరారు. కృష్టానదీ యాజమాన్య బోర్డు పరిధి, విధివిధానాలను ఖరారు చేసి నోటిఫికేషన్ జారీ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలన్నారు. దుంగరాజు పట్నం ఓడరేవు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. చంద్రబాబు విజ్ఞప్తులకు మోడీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ అంశాలతో పాటు రాష్ట్రం, కేంద్రంలోని రాజకీయ పరిస్థితులపైనా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తుపైనా ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. మోడీతో చంద్రబాబు భేటీ ముగిసిన కాసేపటికే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మోడీకి అవసరముంటేనే చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇస్తారని నాలుగు రోజుల క్రితం విమర్శించిన జేసీ, సీఎం, పీఎం భేటీ తర్వాత మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని స్పష్టంచేశారు. చంద్రబాబు కార్యసాధకుడని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సినవన్నీ ఆయన సాధిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీనే విజయం సాధిస్తుందని జోస్యంచెప్పారు. కొందరు నేతలు మిడిమిడి జ్ఞానంతో టీడీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని రాష్ట్ర బీజేపీ నేతలను ఉద్దేశించి జేపీ పరోక్షవిమర్శలు చేశారు. మొత్తానికి మోడీ, చంద్రబాబు భేటీ, జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే…టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు తొలగిపోయినట్టు అనిపిస్తోంది.