తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి రోజులు గడుస్తున్నా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయకపోవడం దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని సమావేశపరచకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయని చెప్పారు. ఓటమిని సమీక్షించుకుని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంతో ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో కొంత ముందుగా నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని ఓటమిపై సమీక్షించుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని ఆరోపించారు. ఒక్క శాతం ఓట్ల తేడా ఉన్న ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోనూ వీవీప్యాట్ స్లిప్లను లెక్కపెట్టలేదని మండిపడ్డారు. సాయంత్రం 4 తర్వాత మంచిర్యాలలో వేల సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయని, పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో చోటుచేసుకున్న ఇలాంటి తప్పులను రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదని, అలాగే తెలంగాణలో చంద్రబాబు ప్రచారంతో ఎలాంటి నష్టం జరగలేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. పొత్తుల వల్లే ఓడిపోయామనేది సరికాదని, అయితే పొత్తులు విషయంలో కొంత ముందుగా నిర్ణయం తీసుకుంటే మరింత లాభం కలిగేదని ఆయన అభిప్రాయపడ్డారు.