బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు పూనుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేక పెడెరల్ ఫ్రంట్ ఏర్పుటు చేసే ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు జాతీయ స్థాయి నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ని కూడా కలిశారు. అయితే నవీన్ తన మద్దతు చంద్రబాబుకే అని తన పార్టీ ఎంపీ ద్వారా రాయబారం పంపారు. కానీ అనూహ్యంగా ఈ రోజు మహా కూటమిలో చేరే ఉద్దేశమేమీ లేదని ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిలోగానీ, భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోగానీ చేరబోమని ఆయన ప్రకటన చేయడం ఒకరకంగా చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి. దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. ఈరోజు బీజేడీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నెల 19 న బీజేపీయేతర పార్టీల నేతల సమావేశం అవ్వబోతున్న తరుణంలో నవీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి.