ఏపీలో ప్రస్తుతం టీడీపీ-వైసేపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ బాబు మీద విరుచుకుపడే వైసీపీ నేతలకి తోడుగా ఇప్పుడు పవన్ కూడా సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు మీద విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు పవన్ లు పావుగంటపాటు సమావేశం కావడం ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై రెయిన్ ట్రీ పార్క్ సమీపంలోని లింగమనేని ఎస్టేట్స్‌లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన, . మహాకుంభాభిషేకం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురు నేతలు వచ్చారు.
దశావతార వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూజ చేశారు. దత్తపీఠాధిపతి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో ఒకేసారి పూజలు చేయించారు. అంతకుముందు చంద్రబాబుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఇరువురు నేతలు పక్కపక్కనే నిలబడినప్పటికీ మొదట పలకరించుకోలేదు. దేవాలయానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు విడివిడిగా వచ్చారు. ఆలయం వెలుపల ఉన్న టీవీ విజువల్స్‌లో వీరు పలకరించుకోకపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే లోపలకు వెళ్లిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. వీటికి సంబంధించిన విజువల్స్ మాత్రం కెమెరాకు చిక్కలేదని తెలుస్తోంది. కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు-పవన్‌లను గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి పిలిచి ఓ గదిలోకి తీసుకెళ్లారు. సచ్చిదానంద స్వామి దగ్గర వీరిరువురూ 20 నిమిషాలున్నారు. తీర్థప్రసాదాల కోసమే వీరిని స్వామి లోపలికి పిలిచారని, ఆధ్యాత్మిక విషయాలే చర్చకు వచ్చాయని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కాబట్టి రాజకీయాల గురించి వారు ప్రస్తావించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆధ్యాత్మిక అంశాలపై చంద్రబాబు-పవన్ చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు.
గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో నవధాన్యాలను ఉంచే సందర్భంగా పక్కన ఉన్న పవన్‌ను చూసి చంద్రబాబు నవ్వుతూ పలకరించారని, దీనికి పవన్ ఎలా ఉన్నారని అడిగారట. చంద్రబాబును కుశల ప్రశ్నలు వేశారు. దనికి సమాధానంగా చంద్రబాబు బాగున్నానని చెప్పారు. మీరెలా ఉన్నారని అడిగారు. ఇరువురు కుశలప్రశ్నలు వేసుకున్నారని అక్కడే ఉన్న టీడీపీ మంత్రులు ఎమ్మెల్సీల ద్వారా బయటకి వచ్చింది అని తెలుస్తోంది. విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయ్యాక వేదపండితులు తొలుత పవన్‌కు ప్రసాదం ఇవ్వబోగా.. ‘‘కాదు, కాదు.. తొలుత ముందుగా పెద్దవారికి సీఎం గారికి ఇవ్వండి’’ అని పవన్ అన్నారు. చంద్రబాబు పుచ్చుకున్నాక పవన్ తీసుకున్నారు. మొత్తానికి ఉప్పు-నిప్పులా ఉండే నేతలు ఇద్దరూ ఒకే గదిలో 20 నిమిషాలు కలిసి కూర్చుని మాట్లాడడం చర్చనీయాంశమైంది.