Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్రప్రయోజనాల కోసం నాలుగేళ్లుగా సంయమనం పాటిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు… తొలిసారి బీజేపీపైనా, ప్రధానమంత్రి మోడీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, పవన్ ను ఉసిగొల్పడం, వైసీపీతో మంతనాలు నేపథ్యంలో బీజేపీతో నాలుగేళ్ల చెలిమికి గుడ్ బై చెప్పి… ఎన్డీఏనుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత… చంద్రబాబు మోడీ కపటనీతిని ఎండగడుతున్నారు. ప్రధాని… జగన్, పవన్ కళ్యాణ్ తో కలిసి డ్రామాలాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీ భావిస్తున్నారని, అయితే అది జగన్, పవన్ వల్ల వచ్చినట్టు చూపించాలని ఆయన భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్టు తనకు తెలిసిందని, అయితే వైసీపీ, జనసేన చేసిన నిరసనలు, కేంద్రంపై తెచ్చిన ఒత్తిడికారణంగానే ఇస్తున్నట్టు ప్రజలను మభ్యపుచ్చాలన్నది మోడీ ఆలోచనని ఆరోపించారు.
వైసీపీ అవిశ్వాసం పెట్టి, రాజీనామాలు చేసి, తీవ్ర నిరసనలు చేపట్టిన తర్వాత, అలాగే హోదా కోసం పవన్ దీక్ష చేసిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నామని, ప్రజా సెంటిమెంట్ ను గౌరవిస్తున్నామని ప్రధాని నుంచి ప్రకటన వస్తుందని చంద్రబాబు అంచనావేస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు, జగన్ కు కేంద్రంలోని పెద్దల నుంచి సూచనలు అందాయని, అందుకే హోదా కోసం ఆమరణదీక్షకు దిగుతానని పవన్ ప్రకటించారని ముఖ్యమంత్రి విశ్లేషించారు. మోడీ వ్యూహం వెనక టీడీపీని అస్థిరపరచాలన్న కుట్ర ఉందని, దీనిపై ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, దీన్ని ఎదుర్కొంటామని ఆయన అన్నారు. దోషులందరినీ ప్రజాకోర్టులో నిలబెడతామని హెచ్చరించారు.