ఆ లాంఛ‌న‌మూ పూర్త‌యింది.. ఎన్టీఏతో టీడీపీ తెగ‌దెంపులు

Chandrababu TDP Exits NDA alliance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు ఒక్క‌రోజులో వేగంగా మారిపోయాయి. నేడా, రేపా అన్న లాంఛ‌నం పూర్త‌యింది. ఏపీకి ప్రత్యేక హోదా ప్ర‌క‌టించ‌ని ఎన్డీఏ కూట‌మి నుంచి వైదొల‌గాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది. ఎంపీలు, ఇత‌ర నేత‌ల‌తో అత్య‌వ‌స‌ర టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు త‌న నిర్ణ‌యం వెల్ల‌డించారు. అనంత‌రం బీజేపీ జాతీయఅధ్య‌క్షుడు అమిత్ షాకు ఫోన్ లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంలో కేంద్రం చూపుతున్న వైఖ‌రికి నిర‌స‌న‌గానే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, అమిత్ షా పేరిట ఓ లేఖ పంపామ‌ని, అందులో అన్ని విష‌యాలు స‌వివ‌రంగా ప్ర‌స్తావించామని చంద్ర‌బాబు చెప్పారు. ఎన్డీఏ క‌న్వీన‌ర్ ప‌ద‌వి నుంచి కూడా వైదొలుగుతున్న‌ట్టు స్ప‌ష్టంచేశారు.

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా నుంచి పెద్ద‌గా స్పంద‌న రాన‌ట్టు స‌మాచారం. టీడీపీ ఈ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని త‌మ‌కు ముందే తెలుస‌న్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడార‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. మీరు నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత ఇక మాట్లాడేందుకు ఏముంటుంద‌ని అమిత్ షా వ్యాఖ్యానించిన‌ట్టు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు రావాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న వెంట‌నే చంద్ర‌బాబు చ‌క‌చ‌కా పావులు క‌దిపారు. మొద‌ట వైసీపీ అవిశ్వాసతీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని భావించ‌ని చంద్ర‌బాబు త‌ర్వాత వ్యూహం మార్చారు. వైసీపీకి మ‌ద్ద‌తిస్తే త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని భావిస్తున్న చంద్ర‌బాబు టీడీపీనే సొంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని నిర్ణ‌యించారు. చంద్ర‌బాబు నిర్ణ‌యం మేరకు 16 మంది టీడీపీ స‌భ్యుల సంత‌కాల‌తో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత తోట న‌ర్సింహం లోక్ స‌భ కార్య‌ద‌ర్శికి అందించారు. ఏపీపై, టీడీపీపై బీజేపీ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని ఆరోపించారు.