యూటర్న్ నాది కాదు మీదే : బాబు

chandrababu-press-meet-at-delhi
అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీల కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు  జాతీయ మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందూ ఏపీ ప్రజలకు న్యాయం చేయడంలో సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉందని తెలుసని.. అయినా తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని  15 ఏళ్ల తర్వాత తామే అవిశ్వాసం పెట్టామని చెప్పారు. మెజారిటీకి, మొరాలిటీకి మధ్య జరుగుతోన్న పోరాటమిదని పేర్కొన్నారు. ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన కేంద్రం ఆ పని చేయలేకపోయిందని, ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఏపీకి హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారన్నారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. ఏపీకి ఇంకా ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారని అన్నింటిలోనూ యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.
విభజన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి.. ఒక్కటీ నెరవేర్చలేదు. కేంద్ర పెద్దలందరినీ కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశామని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు శతవిధాలు ప్రయత్నించామని చెప్పారు. నాలుగేళ్లు చూశాక.. ఓపిక నశించి కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం అవాస్తవమని.. ఆర్థిక సంఘం సభ్యుడు టి.గోవిందరావు అలాంటి సిఫార్సు చేయలేదని చెప్పారని తెలిపారు. కేసీఆర్ తో పోలుస్తూ… తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మోదీ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మోడీ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. అవినీతిని సహించబోమంటూనే గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు టికెట్లు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ ట్రాప్‌లో చంద్రబాబు పడ్డారన్న మోడీ వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు. నిన్న జగన్‌ కోర్టులో ఉంటే మా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడారన్నారు.  రాష్ట్ర విభజనతో నష్టపోయామని.. ఆదుకోమని అడిగితే మాపైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవ్వరికీ ప్రత్యేక హోదా లేదన్నారని.. కానీ ఇప్పటికీ 11 రాష్ట్రాలకు రాయితీలు ఇస్తున్నారని గుర్తుచేశారు. కేంద్రం నమ్మకద్రోహం – కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నామని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు