Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రతిపక్ష నేత జగన్ ఎంత రెచ్చగొట్టినా టీడీపీ కార్యకర్తలు సంయమనం కోల్పోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్ సంగతి, ఆయన పార్టీ సంగతి ప్రజలే చూసుకుంటారని, కార్యకర్తలెవరూ స్పందించవద్దని చంద్రబాబు కోరారు. నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబును నడిరోడ్డుమీద కాల్చి చంపినా తప్పులేదు అని జగన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తొలిసారి స్పందించారు.
జగన్ వైఖరి ఉన్మాదిని తలపిస్తోందని ఆయన మండిపడ్డారు. సీఎం ను చెప్పుతో కొట్టాలి, నడిరోడ్డు మీద కాల్చి చంపాలి, కలెక్టర్ ను జైలుకు పంపిస్తా… పోలీస్ కమిషనర్ పింఛను ఆపేస్తా… అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని నేరప్రవృత్తిని బయటపెడుతున్నాయని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇది ఉన్మాదం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. జగన్ వైఖరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలా ఉంటే, ఇక అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ప్రజలే బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేసే బాధ్యత పార్టీ నేతలదే అన్న బాబు, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 30కంటే ఎక్కువ సీట్లు రావని సర్వేలన్నీ చెబుతున్నాయని… ఓడిపోతామన్న నిస్పృహతోనే జగన్ విచక్షణారహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మరిన్ని వార్తలు: