Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల మీద పోరాటంలో ముందడుగు వేయాలని టీడీపీ పార్లమెంటరీ బోర్డు భేటీ తరువాత అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఎన్ని విన్నపాలు చేసినా కేంద్రం లెక్కచేయకపోవడంతో ఇక జాతీయ స్థాయి పోరాటం చేయాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎంపీ ల అభిప్రాయాలు తెలుసుకున్న టీడీపీ అధినేత కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సంకేతం ఇచ్చారు.
విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, మోడీ సర్కార్ దానికి తూట్లు పొడిచిన వైనం, హోదాకి బదులు ప్యాకేజ్ అని ప్రకటించడం, ఆపై దానికి కూడా తిలోదకాలు ఇవ్వడం వంటి విషయాల మీద సమగ్రంగా ఓ లేఖ రాసి దాన్ని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు రాష్ట్రంలోని అన్ని పక్షాలకు పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక ఈ నెల 5 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం మీద పోరాడాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడా ఈ పోరాటానికి కూడగట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో టీడీపీ నాయకులు నిన్న భేటీ అయినప్పుడు కూడా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పూర్తి అహంభావ పూరిత ధోరణిలో వ్యవహరించడంతో ఇక పోరాటం తప్ప మరో మార్గం లేదని టీడీపీ భావిస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే టీడీపీ కి చెందిన కేంద్రమంత్రులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ లో ఈ రాజీనామా ప్రకటనలు ఉండొచ్చని సమాచారం.