Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బడ్జెట్ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తీవ్రమయిన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాపు రిజర్వేషన్ల అంశానికి కేంద్రం మోకాలొడ్డింది. కాపు రిజర్వేషన్ బిల్లును నిలిపివేసేందుకు రాష్ట్రపతికి విన్నవించాలని ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో నడిచే డీవోపీటీ హోంశాఖకు సూచించింది. 50శాతానికి మించి కోటాను ఏ ప్రాతిపదికన, ఎందుకు ఇవ్వాలో ప్రభుత్వం చెప్పలేదన్న ఒకే ఒక్క కారణంతో డీవోపీటీ ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్న ఎన్నికల హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం బీసీ కమిషన్ నియమించింది. కమిషన్ సిఫార్సు మేరకు గత డిసెంబర్ లో ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపింది.
నిబంధనల ప్రకారం గవర్నర్ దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఆయన ఆమోదముద్ర పడిన తరువాత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో ఈ అంశాన్ని చేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవు. అయితే బిల్లు ఆమోదానికి ముందు రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ సలహాలు, సూచనలు తీసుకుంటారు. హోంశాఖ దీనిపై శిక్షణ వ్యవహారాల శాఖ అభిప్రాయం కోరుతుంది. ఇక్కడే కాపు రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం అడ్డుతగిలింది. బిల్లు పార్లమెంట్ వరకూ వెళ్లకుండానే దీనిని నిలిపివేయాలని హోం శాఖకు సూచించింది. 1992నాటి ఇందిరా సాహ్ని కేసును ఉటంకిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండాలని స్పష్టంచేసింది. డివోపీటీ నిర్ణయం నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లపై ఆందోళన అవసరం లేదన్నారు . కాపు రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ను సవరణచేసి రిజర్వేషన్లు కల్పించమని కేంద్రాన్ని కోరామని తెలిపారు.