Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్థితప్రజ్ఞత గల నాయకుడు. సినిమా పరిభాషలో చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు. నవ్యాంధ్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అప్పటి అధికార కాంగ్రెస్ వైఖరే దీనికి కారణం. దీంతో ఏపీ ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. విభజన బాధిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి చంద్రబాబు అయితేనే న్యాయం చేయగలరని రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమయింది. చంద్రబాబు సీఎం కావాలని ప్రజలంతా కోరుకున్నారు. బాబుపై ప్రజల్లో ఉన్న ఈ సానుకూలతను గమనించిన బీజేపీ టీడీపీతో పొత్తుకోసం వెంపర్లాడింది. కోలుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రానికి కేంద్రప్రభుత్వ అండదండలు అవసరమని భావించిన చంద్రబాబు బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగారు. ఇరు పార్టీల మధ్యా గతంలో ఉన్న స్నేహం ఆ ఎన్నికలతో మళ్లీ చిగురించింది.
కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా, ఏపీలో టీడీపీ గెలుపొందింది. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా కాగా… టీడీపీ ఎన్డీయేలో చేరింది. కొన్నేళ్లవరకు ఈ పొత్తు బాగానే సాగింది. కానీ అదుపులేని అధికారం, దక్షిణాది ప్రజలపై ఉత్తరాది నాయకులకు సహజంగా ఉండే చిన్నచూపు, ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదులు కలిసి మోడీకి, బాబుకు మధ్య దూరాన్ని పెంచాయి. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా హామీఇచ్చిన మోడీ దాన్ని బుట్టదాఖలు చేశారు. రాజధాని శంకుస్థాపన కొస్తూ మట్టి, నీళ్లు తెచ్చి హాస్యాస్పదంగా వ్యవహరించారు. సభావేదికపై చంద్రబాబు రాజధాని నిర్మాణానికి సాయమందించాలని కోరినా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు వాటన్నింటినీ వ్యక్తిగతంగా తీసుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో రాజీధోరణితోనే ముందుకు వెళ్లారు. అయినా మోడీ, అమిత్ షాల వ్యవహార సరళి మారలేదు. ఒక దశలో టీడీపీని, చంద్రబాబును దూరం పెట్టి ప్రతిపక్ష నేత జగన్ ను దగ్గరకు తీశారు.
ఏపీకీ, కేంద్రానికి మధ్య వారధిగా ఉన్న వెంకయ్యనాయుణ్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించారు. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా మోడీ… ఆయన్నే కాదు… ఏపీ ప్రజలనూ అవమానించారు. ఇన్ని జరిగినా ఏనాడూ చంద్రబాబు బీజేపీపై ఒక్క విమర్శా చేయలేదు. మూడేళ్ల కాలంలో కేంద్రప్రభుత్వ తీరును చంద్రబాబు బహిరంగంగా విమర్శించింది ఒక్క పోలవరం విషయంలోనే. పోలవరాన్ని ఏపీకి వరప్రదాయినిగా భావిస్తున్న చంద్రబాబు గడువులోపు ఎలాగైనా ఆ ప్రాజెక్టు పూర్తిచేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అన్ని విషయాల్లోనూ ఏపీని చిన్నచూపు చూస్తున్న కేంద్రం పోలవరం విషయంలోనూ అడ్డంకులు సృష్టించడంతో చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేంద్రం తీరును తీవ్రంగా ఆక్షేపించారు. దీంతో దిగివచ్చిన కేంద్రం పోలవరంకు అన్నివిధాలా సహకరించేందుకు ముందుకొచ్చింది. పోలవరం విషయంలో నెగ్గిన చంద్రబాబు… రాష్ట్రప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు మళ్లీ తగ్గి ఉండాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ నేతలెవరూ బీజేపీ నేతలపై విమర్శలు చేయవద్దని చెప్పడం ఇందులో భాగమే.
బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలపై టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ విమర్శలు చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. సోము వీర్రాజులాంటి వారి వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలేయాలని, పార్టీ అనుమతిలేకుండా బీజేపీ నేతలపై టీడీపీ నేతలెవరూ కామెంట్లు చేయవద్దని ఆయన ఆదేశించారు. చంద్రబాబు ఇలా తగ్గిఉండడాన్ని బీజేపీ అలుసుగా తీసుకుంటే.. ఆ పార్టీకే నష్టం. బాబుకు కేంద్రంలో జరిగే అవమానాలు, ఏపీలో బీజేపీ ప్రజాదరణను ప్రభావం చేస్తాయన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకుంటే మంచింది. ముందుగా అన్ని రాష్ట్రాల్లోలానే ఏపీలోనూ అధికారం సాధించాలని కలలు కనడం బీజేపీ మానుకోవాలి. మిగిలిన రాష్ట్రాన్న రాజకీయ పరిస్థితులు ప్రత్యేకమని మోడీ, అమిత్ షాలు తెలుసుకుంటే…అన్ని మనస్ఫర్ధలూ తొలగిపోతాయి.