Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రకాశం జిల్లా టీడీపీ లో అంతర్గత కలహాల మీద ఇక ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరణం, గొట్టిపాటి నేరుగా ఒకరితో ఇంకొకరు దూషణలకు దిగిన ఎపిసోడ్ పై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఓ నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా బాధ్యతలు చూస్తున్న మంత్రి నారాయణతో పాటు వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించాకే టీడీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అధినేత చంద్రబాబు ఆ వ్యవహారం గురించి మాట్లాడినట్టు సమాచారం .
ప్రకాశం జిల్లా నేతల వ్యవహారశైలితో పార్టీ పరువు పోతోందని మొదలుపెట్టిన చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. “ నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. పాత నాయకులు, కొత్త నాయకులూ కలిసి పనిచేయాలని ఎన్నోసార్లు చెప్పాము. ఎమ్మెల్యేలకు ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చాక వేరే వారిని కలగజేసుకోవద్దని కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. కొత్త చేరికల వల్ల పాత నాయకుల కు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోటే వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించాం. ఇంత కంటే ఏమి చేయాలి. అయినా గొడవలు పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించను.” అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే అవి పూర్తిగా సీనియర్ నేత కరణం బలరాం ని ఉద్దేశించి మాత్రమే అని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. ఇంతకుముందు కూడా గొడవలు జరిగినప్పుడు బాబు ఇలాంటి కామెంట్స్ చేసినా అవి బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఈసారి మాత్రం పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించడం చూస్తుంటే దీనికి కొనసాగింపుగా క్రమశిక్షణ చర్యలు లేదా కనీసం షో కాజ్ నోటీసు అయినా ఇస్తారన్న టాక్ దేశం వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.