చమన్ సాబ్ ఇంటికి ఫోన్ చేసిన చంద్రబాబు !

Chandrababu talking to Chaman Sab wife after Chaman death

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పరిటాల ప్రధాన అనుచరుల్లో ఒకడిగా పేరున్న దూదేకుల చమన్ సాబ్ నిన్న హఠాన్మరణం పాలయిన సంగతి తెలిసిందే. ఒకవైపు పరిటాల కుటుంబం పెళ్లి సందడిలో ఉండగా ఉన్నట్టుండి చమన్ కి గుండె పోటు రావడం వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించడం ఆయన మృతి చెందడం అంతా ఒక లీలలా జరిగిపోయాయి. చిన్నప్పటి నుండి పరిటాల రవికి, ఆయన సోదరుడు హరికి సన్నిహితుడిగా మెలిగిన ఆయన రవికి తలలో నాలుకలా మెలిగేవాడు. ఒకానొక సమయంలో నేను సంతకాలు పెట్టే మంత్రిని, చమన్ పనిచేసే మంత్రి అని రవి అన్నారంటే ఆయనకి రవి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాడో అర్ధం చేసుకోవచ్చు.

అలాంటి చమన్ మరణం పరిటాల కుటుంబానికి, అనంత తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అనే చెప్పాలి. పరిటాల రవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చమన్ మృతిపట్ల పరిటాల అభిమానులు కూడా దిగ్ర్భాంతికి గురయ్యారు. అనంత తెలుగు దేశం శ్రేణులు తీవ్ర ఆవేదనకీ గురవుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో చమన్ సాబ్ భార్య రమీజాబీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడి ఆమెను ఓదార్చారు. చమన్ కుటుంబానికి అండగా ఉంటామని, చమన్ చిరకాలవాంఛ అయిన ఆయన కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా… చమన్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన రామగిరి మండలం ఆర్. కొత్తపల్లిలో జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, పరిటాల రవి అభిమానులు పాల్గొననున్నారు.