Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో ఏపీని చిన్నచూపు చూస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ తీవ్ర హెచ్చరిక చేశారు. విభజన వల్లే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేసిన ఆయన హామీల అమలు కోసం అవసరమైతే కోర్టుకు వెళ్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ఈ వ్యాఖ్యలు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న భావన కలగడంతో… పత్రికలు, టీవీ చానళ్లు, వెబ్ సైట్లన్నీ బీజేపీ, టీడీపీ పొత్తుపై విశ్లేషణలు చేశాయి. ఇద్దరి మధ్య మైత్రీబంధం దాదాపుగా ముగిసినట్టేనని, బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి టీడీపీ సిద్దంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తంచేశాయి. శనివారం మీడియా కథనాలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చే ప్రయత్నంచేశారు.
తన వ్యాఖ్యల్ని వక్రీకరించడం తగదని సూచించారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం గురించీ, ఇటీవల జరిగిన మోడీతో తన భేటీ గురించి సానుకూల వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని కలిశాక రాష్ట్ర హామీల విషయంలో స్పష్టత వచ్చిందని, మోడీతో భేటీ తర్వాత పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని, సమస్యలు పరిష్కారమయ్యే వాతావరణం ప్రధానితో భేటీ అనంతరం తనకు కలిగిందని చెప్పారు. కోర్టుకు వెళ్తామని చేసిన వ్యాఖ్యలు బీజేపీకి వ్యతిరేకంగా భావించరాదన్నారు. కేంద్రప్రభుత్వం తమకు న్యాయం చేయకుంటే చివరి అస్త్రంగా కోర్టును ఆశ్రయిస్తానని మాత్రమే తాను చెప్పినట్టు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
అయితే తన వ్యాఖ్యల తరువాత బీజేపీ, టీడీపీ పొత్తుపై జరుగుతున్న చర్చకు తెరదించేందుకే ముఖ్యమంత్రి ఇలా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హామీల అమలుపై కేంద్రం వైఖరిని చూస్తూ ఊరుకోవడం సరికాదన్న భావనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. మరికొన్ని రోజులు పాటు కేంద్రం వైఖరిని గమనించి… తీరు మారకపోతే పొత్తు తెగతెంపులు చేసుకుని కోర్టును ఆశ్రయించడమే ఏకైక అస్త్రంగా ఆయన భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కోర్టుకు వెళ్లాలన్న తన ఆలోచనను కేంద్రం ఎలా స్వీకరిస్తుందో తెలుసుకోవడానికే ఆయన కలెక్టర సదస్సులో ఇలా వ్యాఖ్యానించారని భావిస్తున్నారు.