మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పరామర్శించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఇంటికి కూడా వెళ్ళకుండా నేరుగా ఈ రోజు ఉదయం విశాఖ జిల్లా పారేడుకు బయలుదేరి వెళ్లారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాననీ, భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు కుమారులు సందీప్, శ్రవణ్ లను ఒదార్చిన చంద్రబాబు ఓ దశలో తాను కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘మీ కుటుంబానికి అండగా నేనుంటానని ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. సీఎం వెంట మంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పంచకర్ల రమేష్‌బాబులు కూడా ఉన్నారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గిరిజనుల కోసం సర్వేశ్వరరావు ఎనలేని సేవలందించారన్నారు చంద్రబాబు. ఆయన మంచి నాయకత్వం లక్షణాలున్న నేతని కొనియాడారు. కిడారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. రూ.కోటి ఆర్థికసాయం, విశాఖలో ఇంటి నిర్మాణానికి సహకరిస్తామన్నారు. అలాగే ఆయన చిన్న కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. మొదటి నుంచి తాము బాక్సైట్‌కు వ్యతిరేకమని.. నేతల్ని చంపాడనికి మావోయిస్టులుకు ఇది నెపం మాత్రమేనన్నారు. అభివృద్ధికి పాటుపడేవారిని చంపితే గిరిజన ప్రాంతాలు ఎలా బాగుపడతాయని ఆయన ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులను చంపితే ప్రజలకే నష్టమనీ, దీనివల్ల ఎలాంటి లాభం జరగదని వ్యాఖ్యానించారు.