Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీల అమలు కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. సమావేశం ఎప్పుడు జరగనుంది… ఎవరెవరని ఆహ్వానించాలనే విషయంపై టీడీపీ వర్గాల్లో సుదీర్ఘ చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగే పార్టీ సమన్వయ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 24, 25, 26తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు జరగనున్నందున ఈలోపే అఖిలపక్ష సమావేశం ఉంటుందని భావిస్తున్నారు.
అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలకే ఆహ్వానం పంపడమా… లేక ఇతర పార్టీలను కూడా పిలవడమా అనే అంశంపై సదస్సులో సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. టీడీపీతో పాటు వైసీపీ, బీజేపీకి మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన, లోక్ సత్తా, తదితర పార్టీల తరపున శాసన సభలో సభ్యులెవరూ లేరు. అయినప్పటికీ… ఆ పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా పిలిచే అవకాశం కనిపిస్తోంది. హామీల అమలు విషయంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనే అంశంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్ర ప్రజల మనో భావాలను కాపాడటమే తన లక్ష్యమని, అన్ని పార్టీలను సమావేశపర్చి విభజన హామీలపై చర్చించి, తగిన విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రం వ్యవహరించాలన్నారు.