Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే టీడీపీకి స్ఫూర్తని, పార్టీని స్థాపించినప్పుడే ఎన్టీఆర్ ఆ విషయం చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అంబేద్కర్ ఆశయాలను ఎన్టీఆర్ తూ.చ తప్పకుండా అమలుచేశారన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం శాఖమూరులో నిర్మించనున్న అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రూ.వంద కోట్లో 20 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం 18 నెలల్లో ఏర్పాటుచేస్తామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ అని చంద్రబాబు కొనియాడారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా… దాన్ని అమలుచేసేవారి చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని సీఎం అన్నారు.
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు టీడీపీ అండగా ఉంటోందని తెలిపారు. అన్ని వర్గాల నుంచి నాయకత్వం రావాలని, ఎన్ని కష్టాలు వచ్చినా… పేదవాళ్లకు భరోసాగా నిలుస్తామని హామీఇచ్చారు. పేదరికం లేని సమాజ స్థాపనకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. పెళ్లికానుక ద్వారా పేద పిల్లలకు పెళ్లిచేసే బాధ్యత తీసుకున్నానని, పేద వాళ్లకు 75 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. దళితులకు తొలిసారిగా పక్కాఇళ్లు కట్టించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. కేఆర్ నారాయణన్ ను రాష్ట్రపతి చేయడంలోనూ ఆనాడు చొరవచూపామని, దళితులను చైతన్యవంతం చేసేందుకు, రాజకీయాంగా బలోపేతం చేసేందుకు తాము కృషిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పేదలకోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.