ఒకప్పుడు చందమామ రావే.. జాబిల్లి రావే అని పాట పాడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు.. మామా బ్రో మేమే వచ్చేస్తున్నాం అంటూ చందమామపైకి వెళ్లిపోయాం. ప్రపంచంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమెదటి దేశంగా భారత్ చరిత్రపుటల్లో నిలిచిపోయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది.
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జాబిల్లిపై విక్రమ్ ల్యాంజర్ను విజయవంతంగా దింపిన ఇస్రో టీమ్‌పై ప్రపంచం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జొహెన్నెస్‌బర్గ్ నుంచి స్వయంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు ఫోన్ చేసి అభినందించారు. త్వరలోనే చంద్రయాన్-3 మిషన్ బృందాన్ని అభినందించేందుకు మోదీ బెంగళూరు పర్యటించనున్నారు. ఈ క్షణంతో తన జీవితం ధన్యమైందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ విజయం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలనే సంకల్పానికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా తన మనసంతా చంద్రయాన్‌పైనే ఉందని చెప్పుకొచ్చారు.