Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ జాతీయ కార్యాలయ నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. ఈ తెల్లవారుజామున 5 . 17 నిమిషాలకు టీడీపీ అధినేత చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మంగళగిరి మండలం, ఆత్మకూరు వద్ద దాదాపు 4 ఎకరాల్లో టీడీపీ జాతీయ కార్యాలయ నిర్మాణం తలపెట్టిన విషయం తెలిసిందే. 9 నెలల్లో కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆత్మకూరులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం నిరాడంబరంగా సాగింది. తెలుగు వాళ్ళు ఎక్కడ వున్నా వారికోసం పని చేసే విధంగా టీడీపీ భవిష్యత్ కార్యక్రమాలు వుంటాయని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
పార్టీ కార్యాలయానికి వచ్చే సామాన్య కార్యకర్తకు సైతం గౌరవం ఇచ్చేలా నిర్వహణ వుండాలని బాబు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో పెత్తనం చేసే రాజకీయాలు చేసే ఎవరూ భరించబోరని , ఆ మార్పులు గుర్తించి దానికి తగ్గట్టు పార్టీ వ్యవహారశైలి వుండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ నుంచే టీడీపీ వ్యవహారాలు నడవబోతున్నాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరహాలోనే ఇక్కడ కూడా నిత్య భోజన వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శంకుస్థాపన సందర్భంగా పార్టీ నేతలు కొందరు నిర్మాణానికి విరాళాలు ప్రకటించారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీజీ ఆంజనేయులు 11 లక్షలు, దేవినేని అవినాష్ 10 లక్షలు ప్రకటించారు. మరికొందరు కూడా విరాళాలు ఇచ్చారు. ఇక పార్టీ ముఖ్య నేతలు సైతం త్వరలో ఈ భవననిర్మాణానికి తమ వంతుగా ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.