Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బద్రీనాథ్ యాత్రకు వెళ్లి మంచుతుఫాన్ లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర యాత్రికుల క్షేమసమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీశారు. యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఏపీ భవన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన 66 మంది ఛార్ ధామ్ యాత్రికులు మంగళవారం బద్రీనాథ్ లో చిక్కుకుపోయారు. తామంతా బద్రీనాథ్ కొండపై బస్టాండ్ లో చిక్కుకున్నామని, ఆపదలో ఉన్న తమను రక్షించాలని వేడుకున్నారు. ఉదయం ఏడుగంటలకు బద్రీనాథ్ చేరుకోగా…ఎడతెరిపిలేని మంచువర్షం కురిసిందని, దీంతో కొండపైనే చిక్కుకుపోయామని యాత్రికుల బృందం తెలిపింది. తాము ప్రయాణించే బస్సు సైతం మంచులో కూరుకుపోయిందని చెప్పారు. చిమ్మచీకటిలో మగ్గుతున్నామని యాత్రికులు భయాందోళన వ్యక్తంచేశారు.
మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న ఛార్ ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. వీరిలో 38 మంది సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. మిగిలిన 66 మంది బద్రీనాథ్ లో ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. వారంతా 55 ఏళ్లకు పైబడిన వారే. అటు ఉపాధి హామీ పనుల పరిశీలన నిమిత్తం ఉత్తరాఖండ్ వెళ్లిన 39మందితో కూడిన జడ్పీటీసీలు, అధికారుల బృందం కూడా మంచువర్షం కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. జడ్పీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో ఈ నెల వెళ్లిన 3న బయలుదేరి వెళ్లిన వీరంతా మంచు వర్షం కారణంగా సీతాపురిలో చిక్కుకుపోయారు. యాత్రికులు, అధికారుల బృందం మంచువర్షంలో చిక్కుకుపోవడంతో ఉత్తరాంధ్రంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. తమ వారి క్షేమ సమాచారంపై కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు.