Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్, చైనా మధ్య యుద్దం తప్పదా…డోక్లామ్ సరిహద్దు వివాదం మరికొన్నాళ్లు కొనసాగనుందా…అంటే అవుననే అనిపిస్తోంది పరిస్థితులను చూస్తే..డోక్లామ్ వద్ద కొన్ని రోజులుగా సైన్యాన్ని మోహరించి ఉంచిన ఇండియా మరో అడుగు ముందుకేసింది. ముందు జాగ్రత్త చర్యగా డోక్లామ్ సమీప గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తోంది. చిన్న చిన్న గ్రామాలను సైతం వదలిపెట్టటం లేదు. నతాంగ్ అనే గ్రామం డొక్లామ్ సరిహద్దుకు కేవలం 35 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో జనాభా చాలా స్వల్పం. అయనప్పటికీ అక్కడి ప్రజలను కూడా వేరే ప్రాంతాలకు తరలించింది.
సరిహద్దుల్లో పహారా కాసేందుకు వచ్చిన సైన్యాన్ని ఉంచేందుకు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఓ ఇంగ్లీషు వెబ్ సైట్ లో కథనం వచ్చింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. అయితే సెప్టెంబరులో జరిగే వార్షిక సైనిక విన్యాసాల కోసం గ్రామాలను ఖాళీ చేయిస్తున్నాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత్, భూటాన్, చైనా ట్రై .జంక్షన్ వద్ద చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో రెండు దేశాల మధ్య మొదలైన విభేదాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. నిర్మాణ పనులను అడ్డుకుంటున్న భారత్ డొక్లామ్ వద్ద సైన్యాన్ని మోహరించింది. దీంతో చైనా భారత్ కు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్ బేషరతుగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ విషయంలో తమ దేశం రాజీపడబోదని చైనా ఆర్మీ పీఎల్ ఏ కు చెందిన ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వివాదం ముగిసిపోవాలని కోరుకుంటే భారత ఆర్మీ వెనక్కి వెళ్లాలని, లేదంటే సైన్యం ద్వారానే పరిష్కరించాల్సి వస్తుందని, యుద్ధానికి తమ సైన్యం వెనకాడబోదని, కొండనైనా కదిలించవచ్చేమో కానీ పీఎల్ ఏ ను మాత్రం కదల్చలేరని ఆయన హెచ్చరించారు.
అటు చైనా పత్రికలు కూడా యుద్ధం తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరు దేశాల సైన్యం మధ్య ఘర్ణణకు కౌంట్ డౌన్ మొదలయిందని చైనా డైలీ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించటం ఇందుకు నిదర్శనం. చైనా వాదనను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డొక్లామ్ సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ సమస్యను శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చైనాకు సూచించింది.
మరిన్ని వార్తలు: