డోక్లాం వివాదానికి చైనా వ‌క్ర‌భాష్యం

china sensational comments on bharat over doklam issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చైనా విదేశాంగ‌మంత్రి భార‌త్ లో ప‌ర్య‌టించి వెళ్లిన త‌రువాతి రోజే ఆ దేశం నుంచి వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. రెండు నెల‌ల పాటు భార‌త్-చైనా మ‌ధ్య ప్ర‌తిష్టంభ‌న‌గా మారిన డోక్లాం స‌మ‌స్య‌కు చైనా వ‌క్ర‌భాష్యం చెప్పింది. డోక్లాం వివాదానికి భార‌త్ కార‌ణ‌మ‌ని, భార‌త సైనికులు చొర‌బాటు వ‌ల్లే వివాదం త‌లెత్తింద‌ని చైనా ఆరోపించింది. ఈ మేర‌కు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. డోక్లాం స‌మ‌స్య‌తో భార‌త్ – చైనా బంధం తీవ్ర ఒత్తిడికి గుర‌యింద‌ని, భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌మ స‌రిహ‌ద్దు దాటి చొర‌బ‌డ‌డం వ‌ల్లే వివాదాలు చోటుచేసుకున్నాయ‌ని చైనా వ్యాఖ్యానించింది. భార‌త్ – చైనా ద్వైపాక్షిక బంధంపై ఈ స‌మ‌స్య తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని, అయితే చివ‌ర‌కి దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య శాంతియుతంగా ప‌రిష్కార‌మ‌యింద‌ని పేర్కొంది. ఈ ఘ‌ట‌న నుంచి భార‌త్ పాఠాలు నేర్చుకోవాలని, మ‌రోసారి ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

సోమ‌వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భార‌త్ లో ప‌ర్య‌టించారు. ర‌ష్యా, భార‌త్, చైనా విదేశాంగ మంత్రుల స‌మావేశం అనంత‌రం ఆయ‌న మ‌న విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ తో భేటీ అయ్యారు. డోక్లాం వివాదం త‌ర్వాత చైనా మంత్రి ఒక‌రు భారత్ లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. అయితే…భార‌త్ లో మామూలుగానే ఉన్న చైనా విదేశాంగ మంత్రి…స్వ‌దేశానికి వెళ్లిన త‌ర్వాత అస‌లు నైజం ప్ర‌ద‌ర్శించారు.. ఆయ‌న చైనా చేరుకోగానే…విదేశాంగ మంత్రిత్వ శాఖ‌ కార్యాల‌యం త‌ర‌పున ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డం ఆ దేశ ద‌మ‌న నీతిని సూచిస్తోంది.

డోక్లాం స‌మ‌స్య భార‌త్ కోరుకున్న‌ట్టుగా శాంతియుతంగా ప‌రిష్కారం కావ‌డం డ్రాగ‌న్ దేశానికి ఇష్టం లేదు. అందుకే ఆ వివాదాన్ని మ‌ళ్లీ కెల‌కాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే శీత‌ల క్యాంప్ పేరుతో చైనా సైనికులు పెద్ద ఎత్తున డోక్లాం వ‌ద్ద తిష్ట వేసిన‌ట్టు నిన్న వార్త‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో చైనా అధికారికంగా భార‌త్ ను నిందిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిజానికి భూటాన్ త‌మ భూభాగంగా భావించే డోక్లాంలో చైనానే అంత‌ర్జాతీయ నియ‌మాలు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేప‌ట్టింది. భూటాన్ తో మ‌న దేశానికి ఉన్న ఒప్పందం మేర‌కు భార‌త్… చైనా నిర్మాణాల‌ను అడ్డుకోవ‌డంతో డోక్లాం వివాదం త‌లెత్తింది. వివాదానికి తాను కార‌ణ‌మై…నింద‌మాత్రం మ‌న‌మీద వేస్తూ..అతి తెలివితేటలు ప్ర‌ద‌ర్శిస్తోంది చైనా.