Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దొంగతనం చేసిన దొంగే…దొంగా…దొంగా అరవటం అన్న సామెత ఒకటి మనదగ్గర వాడుకలో ఉంది. చైనా ఇప్పుడు అచ్చం అలాగే ప్రవర్తిస్తోంది. భారత్-భూటాన్-చైనా ట్రై జంక్షన్ వద్ద అక్రమంగా రహదారి నిర్మాణ పనులు చేపట్టి భారత్ తో వివాదానికి తెరలేపిన చైనా…తప్పు మొత్తం భారత్ పై నెట్టేస్తోంది. ఆ దేశ మీడియా ద్వారా భారత్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. డోక్లామ్ సరిహద్దు వద్ద భారత్, చైనా వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పరిణతితో వ్యవహరించాల్సిన చైనా మీడియా ఆ దేశ ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడుతోంది. కొ్న్ని రోజులుగా యుద్ధం తప్పదనే అర్ధం వచ్చేలా వార్తలు రాస్తూ… భారత్ కు పరోక్ష హెచ్చరికలు చేసిన చైనా మీడియా ఇప్పుడు పైపైన ఉన్న ముసుగు తొలగించి అసలు రూపం ప్రదర్శిస్తోంది.
చైనా దుందుడుకు చర్యలకు భారత్ దీటుగా బదులిస్తుండటంతో దిక్కుతోచని చైనా మీడియా భారత్ పై నేరుగా మాటల దాడికి దిగింది. ఇష్టమొచ్చినట్టు అవాకులూ చవాకులూ పేలుతూ ఆరోపణలు చేస్తోంది. ఓ మీడియా సంస్థ విడుదల చేసిన వీడియోనే ఇందుకు ఉదాహరణ. సెవెన్ సిన్స్…ఏడు పాపాలు అని టైటిల్ పెట్టి విడుదల చేసిన ఆ వీడియోలో కామెంటేటర్ భారత్ పై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. భారతదేశం తాను చేసిన ఏడు పాపాలను ఒప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని…వ్యాఖ్యానించారు. రెండు నెలలకు పైగా భారత సైన్యం ఆయుధాలు, బుల్డోజర్లుతో చైనా భూభాగంలో అక్రమంగా ప్రవేశించిందని, డోక్లామ్ వివాదాస్పద ప్రాంతమైనా…అది చైనా అంతర్బాగమనే విషయాన్ని భారత్ గ్రహించాలని. చెప్పిన కామెంటేటర్…భారత్ చర్య ఏమన్నా న్యాయంగా ఉందా …ఇతర ఇళ్లల్లోకి వచ్చేమందు తలుపు కొట్టి రావాలని తెలియదా…మీ అమ్మ మీకు చెప్పలేదా అని ప్రశ్నించారు…
అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకారం భూటాన్, టిబెట్ చైనా కిందకే వస్తాయని కూడా ఆ కామెంటేటర్ వ్యాఖ్యానించారు. తద్వారా స్వతంత్ర దేశంగా ఉన్న భూటాన్ పై చైనా నైజాన్ని బయటపెట్టారు. అంతేకాదు భూటాన్ పైనా ఈ వీడియోలో అబద్దపు ప్రచారం చేశారు. డోక్లామ్ తమ భూభాగం కాదని, భూటాన్ వాసులే చెబుతున్నారని, కానీ భారత్ దాని గొంతుమీద కత్తి పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని, భారత్ ప్రవర్తనతో భూటాన్ గందరగోళానికి గురవుతోందని వీడియోలో వ్యాఖ్యాత అసత్య ప్రచారం కొనసాగించారు. భూటాన్ ను రక్షిస్తున్నామనే నెపంతో భారత్ చైనాతో కయ్యానికి కాలుదువ్వుతోందని, అయితే చైనా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటోందని, భారత్ మాత్రం సరిహద్దు నుంచి సైన్యాన్ని వెనక్కి పిలవటం లేదని చెప్పిన కామెంటేటర్ మీ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలతో మీరు చర్చలు చేస్తారా…? అని పరిధులు దాటి అత్యంత తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించాలని భారత్ ప్రయత్నిస్తోంటే…చర్చలకు రాకపోగా…ఇలాంటి వీడియోలు విడుదల చేసి చైనా భారత్ ను మరింత రెచ్చగొడుతోంది. భారత్ పై ఎలాగైనా మానసికంగా పై చేయి సాధించటానికి ఇలాంటి అసత్యపు ప్రచారాలకు ఒడిగడుతోంది. చైనా వైఖరి ఇలాగే కొనసాగితే…రెండు దేశాల మధ్య యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడతాయి.
మరిన్ని వార్తలు: