Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత ప్రధాని నరేంద్రమోడీ రెండురోజుల చైనా పర్యటన అన్నిరకాల ప్రత్యేకతలతో సాగింది. ఎటువంటి ఒప్పందాలు, సంతకాలు, అధికారిక ప్రకటనలకు తావులేకుండా మనసు విప్పి మాట్లాడుకుందాం అని ప్రధాని మోడీని ఆహ్వానించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్…భారత ప్రధానిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. గురువారం రాత్రి చైనాకు చేరుకున్న ప్రధానికి శుక్రవారం వుహాన్ ప్రావిన్స్ వద్ద ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత చైనా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనను మోడీ తిలకించారు. ఈ ప్రదర్శనలో మోడీ కోసం 1982కాలం నాటి బాలీవుడ్ సంగీతానికి స్థానం కల్పించారు. మే వాదా రహా చిత్రంలోని తు హై వహీ పాటను ప్రత్యేకంగా వినిపించారు.
అనేక చారిత్రక, సాంస్కృతిక వస్తువులకు ప్రసిద్ధి చెందిన హుబెయి పురావస్తు శాలను ప్రధాని సందర్శించారు. సందర్శనలో భాగంగా…ప్రధాని మోడీ ప్రఖ్యాత కళాకారుడు గ్జు బీహోంగ్ వేసిన చిత్రాలను చైనా అధ్యక్షుడికి బహూకరించారు. బీహోంగ్ 1939, 1940 మధ్య కాలంలోశాంతినికేతన్ లో కొంతకాలం గడిపినపుడు ఈ చిత్రాలు గీశారు. ప్రత్యేక పర్యటనలో శుక్రవారం, శనివారం ఇరు దేశాధినేతల మధ్య అనధికార చర్చలు సాగాయి. ప్రఖ్యాత ఈస్ట్ లేక్ వద్ద ఇరువురు నేతలు నదీ తీరాన కాసేపు నడుచుకుంటూ మాట్లాడుకున్నారు. టీ తాగారు. అనంతరం డబుల్ డెక్కర్ పడవలో గంటపాటు మోడీ, జిన్ పింగ్ లు విహరించారు. బోటులో ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. బోటులో కూడా మోడీ, జిన్ పింగ్ టీ తాగుతూ ముచ్చటించుకున్నారు.
ఈస్ట్ లేక్ వద్ద ఉన్న ప్రభుత్వ అతిథిగృహంలో జిన్ పింగ్ మోడీకి ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. విందులో భాగంగా మెనూ కార్డును స్వయంగా జిన్ పింగ్ దగ్గరుండి తయారుచేయించారు. మోడీ అభిరుచి ప్రకారం భారత జాతి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెనూ కార్డు మీద జాతీయ జెండా రంగులు ముద్రించారు. మెనూ కార్డుపై భారత జాతీయపక్షి నెమలిని ఉంచి దానికింద చైనా-వుహాన్ అని ముద్రించారు. ఈ కార్డు చూసి మోడీ ఆశ్చర్యపోయారని భారత అధికారులు తెలిపారు. చైనా అధికారులందరికీ మోడీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తనకు లభించిన స్వాగతం, ఆతిథ్యంపై మోడీ ఎంతో సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ఆతిథ్యాన్ని ఊహించలేదని, ఇంతగొప్ప ఆతిథ్యం ప్రధాని హోదాలో తన ఒక్కరికే అందించారేమో అని వ్యాఖ్యానించారు. విందు బాగుందని, జిన్ పింగ్ తో విలువైన సమయం గడపడం బాగుందని అన్నారు.
డోక్లామ్ ప్రతిష్టంభన వల్ల ఇరుదేశాల మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేయడానికి మోడీ పర్యటన దోహదంచేస్తుందని ఇరుదేశాలు భావిస్తున్నాయి. మోడీ పర్యటన కూడా సుహృద్భావ వాతావరణంలో సాగింది. శుక్రవారం వుహాన్ నగరంలో మ్యూజియం సందర్శన 20 నిమిషాల్లో ముగియాల్సి ఉండగా…40 నిమిషాలు పట్టింది. అరగంటలో ముగియాల్సిన మోడీ, జిన్ పింగ్ ల సమావేశం ఏకంగా రెండు గంగల పాటు కొనసాగింది. రెండు దేశాల మధ్య విభేదాలకు కారణమైన తీవ్రమైన అంశాలు కూడా ఇరువురి నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే పర్యటనకు ముందే ఇది అధికారిక పర్యటన కాదని, ఎలాంటి ఒప్పందాలు, చర్చలు, సంతకాలు, తీర్మానాలు, అధికారిక అంశాల గురించి చర్చించబోమని ఇరుదేశాలు ప్రకటించాయి. రెండు దేశాల మధ్య సుస్థిరమైన దీర్ఘకాలిక సంబంధాలకు మోడీ పర్యటన మైలురాయిగా నిలిచిపోతుందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.