Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ కార్యకర్తలకు చాక్లెట్లను పంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర ఏలూరు రూరల్ మండలంలోని లింగాలగూడెంకు చేరుకొంది. అయితే అదే సమయంలో అదే గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా జగన్ పాదయాత్ర అడ్డుగా వచ్చింది. దీంతో జగన్ పాదయాత్ర కారణంగా చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో పాదయాత్ర డ్యూటీ లో అలెర్ట్ అయిన పోలీసులు ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు మోహరించి, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.
అయితే ఎప్పుడు జగన్ మీద విరుచుకు పడే చింతమనేని ఈసారి మాత్రం వైసీపీ కార్యకర్తలతో ఎంతో సౌమ్యంగా మాట్లాడారు. ఎవరి కార్యక్రమాలు వారివేనని చింతమనేని వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చింతమనేని కారులో ఉండగా ఆయనతో కొందరు వైసీపీ కార్యకర్తలు మాట్లాడారు. జగన్ పాదయాత్రను చూసేందుకు వచ్చిన వైసీపీ శ్రేణులకు చింతమనేని ప్రభాకర్ చాక్లెట్లు పంచి ఇచ్చారు. మరో వైపు పోలీసులు భారీ బందోబస్తు మధ్య చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ ను అక్కడి నుండి పంపించివేశారు. ఎటువంటి ఘర్షణలు లేకుండా చింతమనేని అక్కడి నుండి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకోవడం పోలీసుల వంతయింది.