మెగా బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్, ఖాయమేనా ?

Chiranjeevi and Pawan Kalyan karnataka Elections Campaign

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కన్నడ నాట ఎన్నికలు దగ్గర పడడంతో ఇరు జాతీయ పార్టీలు తమ శక్తి కొద్దీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కన్నడ రాష్ట్రంలో ఎన్నికల హీటెక్కుతున్న కొద్దీ ఓవైపు అమిత్ షా – మరో వైపు కాంగ్రెస్ రథసారథి రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో చుట్టేస్తూ మరింత వేడి పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఏకంగా మూడు వారాల పాటు రాష్ట్రంలో మకాం వేసి, కొన్నాళ్లుగా సభలు, సమావేశాలలో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అలానే బీజేపీ తరఫున అమిత్ షా రంగంలోకి దిగి భారీ ఎత్తున పర్యటనలు సాగిస్తున్నారు. ఇక ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారగా, ఈ పోరును అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

కర్ణాటకలో ఓ దఫా దూరమైన అధికారాన్ని తిరిగి సాధించుకునే యత్నాల్లో బీజేపీ ఉండగా, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో సిద్ధరామయ్య వ్యూహాలు పన్నుతున్నారు. మేమేం తక్కువ తిన్నామా అంటూ ప్రాంతీయ పార్టీ జేడీఎస్ సైతం తమ స్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఎన్నికలు అంటేనే సహజంగా కనపడే సినీ గ్లామర్ ఈ ఎన్నికల్లోనూ కీలకం కానుంది. అయితే జరిగేది కన్నడ ఎన్నికలు కాబట్టి కన్నడ సినీ నటులు వస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే కన్నడ ఎలెక్షన్ ఫీవర్ లోకి తెలుగు హీరోల ఎంట్రీ కూడా ఉండనుంది అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి – ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ రాష్ట్ర ఎన్నికల పోరు(ప్రచారం వరకు)లో భాగస్వామ్యం పంచుకోనున్నారని సమాచారం.

కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి – జేడీఎస్ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి తన 151 వ సినిమా ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉండగా, పవన్ కల్యాణ్, ఏపీకి హోదా కోసం ఉద్యమిస్తున్నారు. అయితే ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉండటంతో కాంగ్రెస్ తరఫున చిరంజీవి ప్రచారానికి షెడ్యూల్ కూడా ఖరారైనట్టు సమాచారం. ఈ నెల ఆఖరు వారంలో ఆయన పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తన మిత్రుడు జేడీ (ఎస్) నేత కుమారస్వామి కోరిక మేరకు, ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

పవన్ ప్రచారంపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఆయన జేడీ (ఎస్) తరఫున సరిహద్దు జిల్లాల్లో ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కర్ణాటక – ఆంధ్రా సరిహద్దు జిల్లాలైన బళ్లారి – గుల్బర్గా – బీదర్ తదితర ప్రాంతాల్లో గెలుపోటములని శాసించేస్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. మరోపక్క బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తెలుగువారే. దీంతో వారిని ఆక్టుటకునేందుకు మెగా బ్రదర్స్ ను ఆయా పార్టీలు వాడుకోవడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మెగా బ్రదర్స్ మధ్య జరిగే తొలి ప్రత్యక్ష పొలిటికల్ వార్ ఇదే అవుతుంది.

జనసేన అని ప్రతేక పార్టీ పెట్టినా కాంగ్రెస్ నాయకులని ఏదైనా అన్నాడేమో కాని అన్న చిరంజీవి పేరు పెట్టి పవన్ ఏనాడు విమర్శించలేదు కాని ఇప్పుడు తన పార్టీ కోసం కాక తన స్నేహితుడి పార్టీ గెలుపు కోసం అన్న కి ఎదురెళ్ళి ప్రచారం చేస్తాడా అనే అనుమానాలు లేకపోలేదు. ఒక వేళ అదే జరిగితే ఈ అన్నదమ్ముల సవాల్లో ఎవరు మద్దతు ఇచ్చిన పార్టీ గెలుస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్న కాంగ్రెస్ గెలుస్తుందో లేక తమ్ముడి జేడీఎస్ గెలుస్తుందో కాలమే నిర్ణయించాలి మరి.