మొన్న ప్రజారాజ్యం, నిన్న కాంగ్రెస్, నేడు జనసేన రాజకీయ అవసరాలకి అనుగుణంగా మెగా అభిమానులు కూడా పార్టీలు మారుతున్నారు. మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక మెగా అభిమాన సంఘాల నేతలు, మెగా ఫ్యామిలీ హీరోల అభిమానులంతా చిరంజీవికి మద్దతుగా పార్టీలో చేరారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాక ఆ పార్టీకి తమ సేవలు అందించారు. ఇక చిరంజీవి రాజకీయ భవిష్యత్తు లేదు అనుకున్నాక 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలో కొందరు చేరారు. మరికొందరు చిరంజీవితో పాటే కాంగ్రెస్లో కొనసాగారు. అయితే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. అలాగే మరోవైపు జనసేనాని వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఒకవేళ ఇప్పుడే పవన్ పంచన చేరితే అభిమానుల కోటాలో టికెట్లు సంపాదించవచ్చు అని భావించిన మెగా అభిమానులు రవణం స్వామినాయుడు నేతృత్వంలోఇవాళ పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇప్పటివరకు పవన్ ఒక్కడే జనసేనను ముందుండి నడిపించాడు. ఇప్పుడు ఆ సేనకు… మెగా ఫ్యాన్స్ బలం కూడా తోడవుతోంది. ఇవాళ పవన్ సమక్షంలో… చిరంజీవి అభిమానులు జనసేనలో చేరనున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడుతో పాటు మెగా అభిమానులు ఇవాళ జనసేనలో చేరనున్నారు. దీంతో… పార్టీ బలం పెరగడంతో పాటు వచ్చే ఎన్నికల్లో మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్సే కీ రోల్ పోషించనున్నారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రజారాజ్యం నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ జనసేన ను గత ఎన్నికల ముందు ప్రకటించి బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చి ప్రచారం చేసి సరిపెట్టారు. నిదానమే ప్రధానమన్న ఆలోచన, అన్న వేసిన తప్పటడుగులు వేసేందుకు పవన్ సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే పార్టీ నిర్మాణం మొదలు అన్నిటా తానై వ్యవహరిస్తూ ఏ ఒక్కరిని నమ్ముకుని ముందుకు వెళ్లడం లేదు ఆయన. ఆచితూచి అడుగులు వేస్తూ 2024 లో అధికారం లక్ష్యమని ప్రకటించి ఆ తరువాత అలా ప్రకటిస్తే ఇప్పుడు పార్టీలోకి వచ్చే వారు రారని తెలిసి గట్టి పోరాటం కోసం లేదు లేదు 2019 అధికారమే లక్ష్యం అని చెప్పి పర్యటన మొదలు పెట్టారు. ఈలోగా పవన్ ను తొక్కేందుకు తెరవెనుక జరిగిన కుట్రలతో పవన్ కీ కుటుంబానికీ కొంత గ్యాప్ ఉన్నా మెగాస్టార్ కుటుంబం అంతా జనసేనకు జై కొట్టేశారు(చిరంజీవి మినహాయించి). వారు ఇలా మారడానికి వెనుకనుంచి చక్రం తిప్పింది రాయబారం సాగించింది మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు అని ప్రచారం సాగుతుంది.
నిన్న చిరుతో సమావేశమైన నాగబాబు, చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు జనసేన పార్టీలోకి చేరే అంశంపై అభిమానుల పాత్ర ఏ విధంగా ఉండాలన్న దానిపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ అభిమానులు మెగా అభిమానులందరూ కలసి పనిచేయాలని చిరంజీవి సూచించినట్లు సమాచారం. ప్రజారాజ్యం సమయంలో పార్టీకి, అభిమానులకు వారధిగా ఉన్న నాగబాబు జనసేనలో కీ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. అందుకే దాంతో చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు రవణం స్వామినాయుడు యాక్టివ్ అయిపోయారు. ఆయన వివిధ జిల్లాలలోని ప్రధాన సంఘాలన్నిటితో భేటీ నిర్వహించే ప్రక్రియ మొదలు పెట్టేశారు. తాజాగా జరగబోయే ఆ సమావేశంలో కీలక నిర్ణయాలనే మెగా ఫ్యాన్స్ ప్రకటించనున్నారు.
ఇప్పటికే చిరంజీవి కి పార్టీ పెట్టినప్పుడు మద్దత్తుగా నిలిచిన అభిమాన సంఘాల్లో ముఖ్య నేతలు కార్యకర్తలు జనసేన పని మొదలు పెట్టినప్పటినుంచి పవన్ వెనుకే అనధికారికంగా తిరుగుతున్నారు. ఇప్పుడు స్వామినాయుడు సమావేశం నిర్వహించి బాహాటంగా పవన్ కి అండగా ఉంటామని పిలుపు ఇస్తే అధికారికంగా జనసేన జండా పట్టుకు తిరగనున్నారు. అయితే ఇదంతా కలిసి వచ్చే వ్యవహారంలా అనిపించడం లేదు, ఎందుకంటే ప్రజారాజ్యం సమయంలోనే చిరు ఫ్యాన్స్ గెలవలేదు. ఆయన నాయకత్వంలో గెలిచిన 18 మందిలో 17 మంది పాత నాయకులే, గోదావరి జిల్లలోని కన్నబాబు మాత్రమే నూతన ఎమ్మెల్యే. అయితే అప్పుడు పని చేయని ఫ్యాన్స్ సెంటిమెంట్ ఇప్పుడు పని చేస్తుంది అనుకోవడం భ్రమ ! ఈ మెగా ఫ్యాన్స్ ఎంతవరకు ఉపయోగపడతారు అనేది వేచి చూడాల్సిందే.