ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు విడుడక చేశారు. పెన్షన్లు రెట్టింపు చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని జనవరి నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు. రైతులకు, ఆటోలు నడుపుకునేవారికి మేలు చేసే విధంగా పన్ను మినహాయింపు నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. ట్రాక్టర్లకు కూడా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు పది లక్షల వాహనాలకు పన్ను మినహాయింపు ఇచ్చామనీ, దీని వల్ల రూ. 66 కోట్ల 50 లక్షల భారం అదనంగా ప్రభుత్వంపై పడుతుందనీ, కానీ రైతులు, ఆటోలు నడుపుకునేవారికి, చిన్న వాహానాలపై ఆధారపడి జీవిస్తున్నవారికి ఊరటను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. అలాగే చుక్కల భూముల సమస్యలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంలోని కొన్ని అంశాలకు సవరణలు చేసేందుకు ఆమోదం తెలిపింది. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వం సొంత ఇల్లు కట్టిస్తుందన్న నమ్మకంతో ప్రభుత్వ అనుమతులు లేకపోయినా కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారని టీడీపీ ప్రభుత్వాన్నే నమ్ముకుని ఇళ్లు కట్టుకున్నామనీ, సాయం చేయాలంటూ చాలామంది ప్రజలు కోరుతున్న నేపథ్యంలో ఇలా పేదలు నిర్మించుకున్న ఒక్కో ఇంటికీ రూ. 60 వేలు చొప్పున ఇచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
అంతేకాదు, 1996 నుంచి 2004 మధ్య కాలంలో నిర్మించిన ఇళ్ల మరమ్మతుల కోసం కూడా ఒక్కో ఇంటికీ రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ అధికారులతోపాటు, జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలను కేటాయించడం మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ విడుదల చేస్తున్నట్టు కూడా మంత్రి చెప్పారు. చేనేత కార్మికులకు ఆరోగ్యబీమా పథకం అమలు చేయనున్నట్టు చెప్పారు. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు ఉంటాయని పలువురు ఆసక్తిగా చూశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంపై నిర్ణయం ఉంటుందని ఆశించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 12,500 సాయం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై మంత్రివర్గ భేటీలో కచ్చితంగా నిర్ణయం ఉంటుందని భావించారు. అయితే.. ఈ అంశంపై ఎలాంటి ప్రకటన రాలేదు. సోమవారం రాత్రి పదిన్నర వరకూ జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యాంశాలు ఇవేనని కాలవ శ్రీనివాసులు తెలిపారు.