ఐరాస ఆహ్వానంపై అమెరికా వెళ్లి అక్కడ కీలక ప్రసంగం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తదితరులు ఘన స్వాగతం పలికారు. ఐక్యరాజ్య సమితిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన చంద్రబాబు అక్కడ ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలోనూ మాట్లాడారు. అలాగే, పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే తన విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న వెంటనే అరకులో పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
నేడు ఆయన పాడేరు, అరకు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పాడేరు చేరుకోనున్న ఆయన, ఇటీవల మావోల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆపై అరకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులనూ పరామర్శిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా ఇప్పటికే అరకు, పాడేరు ప్రాంతాన్ని పోలీసులు, కూంబింగ్ దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. నిన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ అరకు, డుంబ్రిగూడ, లివిటిపుట్టు ప్రాంతాల్లో పర్యటించి, కిడారిని హత్య చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. వీఐపీల పర్యటనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.