తెలంగాణలో మహా కూటమి సీట్ల సర్దుబాటు ఫైనల్ స్టేజికి చేరింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లో లెక్క తేల్చడం దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం. భాగస్వామ్యపక్షాల మధ్య ఇందుకు సంబంధించి అవగాహన కుదిరినట్లు సమాచారం. 119 నియోజకవర్గాలకుగాను మిత్రపక్షాలకు 29 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీంతో మహాకూటమి మీద కేసీఆర్ పెట్టుకున్న ఆశల చల్లారాయి. అందుతున్న సమాచారం మేరకు మొత్తం సీట్లు 119 కాగా అందులో, కాంగ్రెస్ పోటీ చేసేవి – 90, తెలుగుదేశం పోటీ చేసేవి– 15, తెలంగాణ జన సమితి పోటీ చేసేవి– 10
సీపీఐ – 4, అయితే మిగతా పార్టీల సంగతి పక్కన పెడితే కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితికి పది సీట్లు దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమిది? నిన్న గాక మొన్న పుట్టిన అభ్యర్థుల్లేని పార్టీకి పది సీట్లా అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోయే పరిస్థితి. అయితే విశ్లేషకుల మాట ఎలా ఉందంటే కోదండరాం చీల్చే ప్రతి ఓటు కేసీఆర్‌కు పడే ఓటే. మిగతా మూడు పార్టీలు తమ ఓట్లను సమీకరిస్తాయి అంతే. అదే కోదండరాం కనుక కలిస్తే నియోజకవర్గానికి కనీసం రెండు మూడు వేల కేసీఆర్ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది.
పైగా తెలంగాణ వ్యాప్తంగా జనామోదం పొందిన, తెలంగాణ కోసమే జీవిస్తాడు, నిజాయితీపరుడు అనే ముద్ర కలిగిన వ్యక్తి కోదండరాం. ఆ అస్త్రాన్ని మహాకూటమి వజ్రాయుధంగా వాడాలనుకుంది. అలా వాడాలంటే కోదండరాంకి సంతృప్తి ఉండాలి. కోదండరాంకి కేటాయించిన సీట్లన్నీ ఓడిపోయినా పర్లేదు గాని అతని ప్రభావం వల్ల మిగతా 109 సీట్లు కలిసి వచ్చే విషయమే ఇపుడు మహా కూటమికి ప్రధానం. అందుకే అతడిని సంతృప్తి పరిచింది మహా కూటమి. పైగా ఇటీవల రెండు మూడు సీట్లు అడుక్కుంటే ఇచ్చేవాడిని కదా అని కేసీఆర్ అవమానించడం కోదండరాంను ఇంకా బాధ పెట్టింది. దీంతో ఐదు లోపు సీట్లు ఇస్తే కేసీఆర్ చేసిన అవమానం నిజమవుతుంది. అందుకే ఆ పార్టీకి సీట్లు పెంచారు.
ఇప్పటికే డిప్యూటీ సీఎం కోదండరాం అనే ఒక ప్రచార అస్త్రం వదిలిన మహాకూటమి ఒక పెద్ద స్టెప్ వేసింది. తెలంగాణ వాదులు ఈ కూటమిపై ఆంధ్రా ముద్ర వేయకుండా ఆపగలిగే శక్తి ఉన్న వ్యక్తి కోదండరాం. అతను డిప్యూటీ సీఎం వంటి కీలక పదవిలో ఉంటే అది తెలంగాణ ప్రజల్లో ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. వీటన్నింటి నేపథ్యంలో మహాకూటమి స్ట్రాంగ్ గా నిలబడేందుకు, కోదండారం పూర్తి స్థాయిలో మహాకూటమిలో నిమగ్నమయ్యేందుకు టీడీపీ-కాంగ్రెస్ తమకు తాము చేసుకున్న రాజకీయ త్యాగం ఆ పది సీట్లు. అలాగే ఒక్క సీటు కూడా వృథా చేయొద్దు. అసమ్మతి లేకుండా వెళ్లి అధికారం వస్తే ఎమ్మెల్యే కాకపోయినా లాభమే. లేకపోతే ఎమ్మెల్యే అయినా ప్రయోజనం లేదు అని నేతలకు చంద్రబాబు చేసిన బ్రెయిన్ వాష్. అందుకే తప్పకుండా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామని, పొత్తు విషయంలో పట్టువిడుపులు ఉండాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఇక 2014లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన అన్ని స్థానాలనూ టీడీపీ కోరుకుంటోంది. మరోపక్క టీడీపీ, టీజేఎస్, సీపీఐల్లోని అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటే తప్ప ఆ నియోజకవర్గాన్ని వదులుకోకూడదని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నారు. మిత్రపక్షానికి బలమైన అభ్యర్థి లేకుండా సీటు కేటాయిస్తే, ప్రత్యర్థి టీఆర్ఎస్ కు సదరు సీటును బంగారు పళ్లెంలో పెట్టిచ్చినట్టేనని వారు భావిస్తున్నారు.