Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ, టీడీపీ మధ్య మాటలయుద్ధం పెరుగుతోంది. రెండు పార్టీల మధ్య సరైన మైత్రి లేదన్న ఊహాగానాలకు ఊతమిచ్చేలా నేతల వ్యాఖ్యలు సాగుతున్నాయి. వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. బీజేపీతో స్నేహంపై ఎప్పుడూ ఏమీ మాట్లాడని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మాత్రం కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశారు. బీజేపీ తమను వద్దనుకుంటే ఓ నమస్కారం పెట్టేసి తమ దారి తాము చూసుకుంటామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీజేపీతో తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, దీనిపై బీజేపీ నేతలే ఆలోచించుకోవాలని ఆయన అనడం సంచలనం సృష్టించింది.
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. టీడీపీతో తాము కూడా మిత్రధర్మమే పాటిస్తున్నామని, టీడీపీనే పాటించడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కృషితోనే రాష్ట్రాభివృద్ది జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీ అభివృద్ధి చెందుతున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఈ అభివృద్ధిని తాము చేసినట్టుగా టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని, రాష్ట్రంలో నిధుల సేకరణపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చేసిన మోసాన్ని తాము మర్చిపోలేమని సోము వీర్రాజు మండిపడ్డారు.