టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందుకు దొందే – నరేంద్ర మోడీ

PM Narendra Modi On Grand Alliance

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా పదిరోజుల గడువే ఉండడంతో, తెలంగాణ రాష్ట్రంలో తన ప్రచారానికి నరేంద్ర మోడీ సిద్ధం అయ్యారు. నిజామాబాద్ లో ఈరోజు జరిగిన నరేంద్ర మోడీ ప్రచారసభలో తెలంగాణ రాష్ట్రంలోని తెరాస మరియు కాంగ్రెస్ పార్టీల మీద విమర్శనాస్త్రాలని సంధించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా తెలంగాణ ప్రజలు వేయకూడదని, మహాకూటమి తరపున పోటీచేస్తున్న అభ్యర్ధులందరిని ఓడించి, వాళ్ళని తెలంగాణ రాష్ట్రంనుండి సాగనంపాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. దేశచరిత్రలో తమ రాష్ట్రంనుండి కాంగ్రెస్ ని తరిమేసిన ప్రజలు మళ్ళీ ఎప్పుడు తిరిగి కాంగ్రెస్ కి అధికారం కట్టపెట్టలేదని గుర్తుచేశారు. దీన్ని ఉదహరిస్తూ “తప్పనిసరి పరిస్థితుల్లో బీహార్లోని ప్రజలు లాలూ కి సరే అంటారేమో కానీ కాంగ్రెస్ కి మాత్రం కాదు. అలాగే ఉత్తర ప్రదేశ్లోని ప్రజలు మాయావతి కి సరేనన్న కాంగ్రెస్ని మాత్రం ఒప్పుకోరు. బెంగాల్లో అయితే కమ్యూనిస్టులకు తప్పదు అనుకుంటే మమతా బెనర్జీ కి అయినా సానుకూలం అంటారేమో కానీ కాంగ్రెస్ కి మాత్రం అనుకూలంగా ఉండరు, తమిళనాడు, గుజరాత్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలెవరూ కాంగ్రెస్ పార్టీని తమ రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వరు. ఈ విధంగానే, తెలంగాణ ప్రజలు కూడా తమ విలువైన ఓటుని కాంగ్రెస్ వేసి, దుర్వినియోగం చేయకుండా, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించకూడదు అని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు హితవు పలికారు.

trs-congress

ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీని కూడా లక్ష్యంగా చేసుకొని, విమర్శలకు దిగారు. ఈ విమర్శల్లో భాగంగా “తెరాస పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలాగే కుటుంబపాలన పార్టీ అని, ఒక నియంతలా అధికార దాహంతో తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబానికి కట్టబెట్టాడని, వాళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరికి ముఖ్యపదవులు కేటాయించకుండా, ప్రజలనే కాక మంత్రులను కూడా చులకన చూసి, తెలంగాణ రాష్ట్రంలో మరో కుటుంబపాలనకు నాంది పలికాదని చెప్పారు. ఇంతవరకు ప్రజలకి గాని, పేదలకు గాని, యువతకు గాని, రైతులు, యువత, నిరుద్యోగులు, వెనుకబడిన వారికి తెరాస ప్రభుత్వం చేసిందేమి లేదని, ప్రజలకు సక్రమంగా అందని పథకాలను ప్రవేశపెట్టి, పాలకులు మరియు అధికారుల జేబులు నింపుతున్నారని, తెరాస పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలతో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని నరేంద్ర మోడీ విశదీకరించారు. కాంగ్రెస్ పార్టీ శిష్యరికం చేసి, రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటికి సోనియా గాంధీ కనుసన్నల్లో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ గడిచిన 50 ఏళ్లుగా రాష్ట్రానికి చేసిందేమి లేదో, ఆ విధంగానే తెరాస పార్టీ కూడా ఈ నాలుగేళ్లలో తెలంగాణ ప్రజలు కలగన్న బంగారు తెలంగాణ కి చేసిందేమి లేకపోగా, మరోసారి అధికారంలోకి వస్తే కేసీఆర్ తెలంగాణ బంగారు పంటను తన కుటుంబంతో కలిసి పీల్చి పిప్పిచేస్తాడని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు తెరాస అనే భూతం, కాంగ్రెస్ అనే ఆగాథం మధ్యలో ఎటూతేల్చుకోకుండా ఉన్నారని, తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటే, ప్రజలు బీజేపీ ని గెలిపించాలని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు.

pm-modi