Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ పార్టీ నాయకులైనా… సొంత పార్టీకి ప్రచారకర్తలుగా ఉంటారు. ఇక పార్టీ ప్రాంతీయ, జాతీయ అధ్యక్షులనయితే… స్టార్ క్యాంపెయినర్లగా భావిస్తుంటారు. కానీ కర్నాటక ఎన్నికల్లో మాత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సొంత పార్టీ కన్నా… ప్రత్యర్థి కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్సే తెలిపింది. కర్నాటక ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాల్లో పదే పదే పొరపాట్లు చేస్తున్న అమిత్ షా పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ సెటైర్లు వేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ సభలో పాల్గొన్న అమిత్ షా తన ప్రసంగంలో తీవ్ర పొరపాటు చేశారు.
సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిమయం అనబోయి… యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అన్నారు. ఈ మాటలు విని అమిత్ షా పక్కనే ఉన్న యడ్యూరప్ప షాక్ కు గురయ్యారు. వెంటనే అమిత్ షా మరో నేత సాయంతో తన పొరపాటు సరిదిద్దుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకు అమిత్ షా హిందీ ప్రసంగాన్ని కన్నడలోకి తర్జుమా చేసే సమయంలో మరో పొరపాటు జరిగింది. హిందీలో అమిత్ షా మాట్లాడిన మాటలను కన్నడలోకి అనువదించే క్రమంలో బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ప్రధానమంత్రి దేశాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా వెంటనే స్పందించింది. ఈ మాటలను వ్యంగాస్త్రాలుగా మలిచి బీజేపీపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్న అమిత్ షా… తన ప్రసంగంలో పొరపాట్లు దొర్లిన మాట నిజమేనని, అయితే ప్రజలు మాత్రం ఎన్నికల్లో తప్పు చేయరు అని కౌంటర్ ఇచ్చారు.
ఈ విమర్శలు, ప్రతివిమర్శలు సద్దుమణగకముందే అమిత్ షా తాజాగా మరోసారి కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసించేలా ఓ వ్యాఖ్య చేశారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన అమిత్ షా సిల్క్ ఉత్పత్తిలో దేశంలోనే కర్నాటక అగ్రస్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ట్విట్టర్ లో ఆనందం వ్యక్తంచేసింది. 2016-17 సంవత్సరంలో కర్నాటకలో సిల్క్ ఉత్పత్తి ఆల్ టైం గరిష్టానికి చేరిందని, మరోసారి నిజాలు మాట్లాడిన అమిత్ షా కు కృతజ్ఞతలని, ఆయన తమ స్టార్ క్యాంపెయినర్ గా మారుతున్నారని ట్వీట్ చేసింది. మొత్తానికి పార్టీపైనా, దేశంపైనా పట్టు నిలుపుకోవాలంటే… కర్నాటకలో తప్పక గెలిచి తీరాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న షా, మోడీ ద్వయం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అమిత్ షా ప్రసంగాల తీరు చూస్తే అర్ధమవుతోంది.