నిత్యం జనారణ్యంలో తిరిగే వాళ్ళు అడవిలోకి వెళ్లి దారి తెన్నూ తెలియక కొట్టుమిట్టాడుతుంటారు. కానీ అడవి గుట్టుమట్లు ఆసాంతం తెలిసిన గిరిజనం మాత్రం అడవిలో ఏ చెట్టు నుంచి ఏ పుట్ట దాకా అయినా తేలిగ్గా వెళ్ళిపోతారు. కానీ అడవిలో పుట్టి అడవిలో పెరిగిన గిరిపుత్రులకే అక్కడ దారి అర్ధం కాక అయోమయంలో పడితే ఎలా ఉంటుంది ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొందరు రాజకీయ ధురంధరుల పరిస్థితి కూడా అలాగే వుంది. విభజన పాపం మూటగట్టుకుని దెబ్బ తిన్న కాంగ్రెస్ గొడుగు కింద దీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన వాళ్లంతా కొత్త రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు అయినా ఇంకా రాజకీయంగా ఓ దారిలో పడలేదు. కాంగ్రెస్ లో కొనసాగుతున్నా , లేక బయటికి వచ్చినా కూడా చాలా మంది ఇదే పరిస్థితుల్లో వున్నారు.
వై.ఎస్ ఆత్మగా చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒంటి చేత నడిపించిన కేవీపీ విభజన తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ కి పూర్వ వైభవం కాదు కదా కనీసం అస్తిత్వం కూడా నిలపలేకపోయారు. కాంగ్రెస్ విషయంలోనే కాదు సొంతం గా కూడా ఆయన వ్యూహాలు పెద్దగా ఫలించడం లేదు. వై.ఎస్ కొడుకుని కాదనుకుని పార్టీలో కొనసాగినప్పటికీ హైకమాండ్ ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏపీ కి సంబంధించిన విషయాల్లో రాజ్యసభలో కేవీపీ పోరాటానికి మిగిలిన కాంగ్రెస్ సభ్యుల మద్దతు దొరికింది అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో పార్టీ లో కొనసాగడమా లేక జగన్ పంచన చేరడమా అన్న విషయంలో కేవీపీ లాంటి రాజకీయ చాణుక్యుడే ఓ నిర్ణయం తీసుకోలేక గింజుకుంటున్నారు. ఇక ఆయన శిష్యుడు గా అనుకునే ఉండవల్లి కూడా గురువు గారి దారిలోనే సతమతమవుతున్నారు.
ఏ పార్టీలో లేనని చెప్పుకుంటూ ఆయన జగన్ కి మేలు చేయాలని చూస్తున్నా ఆ వ్యూహాలు పెద్దగా ఉపయోగపడడం లేదు. పట్టిసీమ, విభజన మీద కోర్టు కేసుల విషయంలో ఆయన వాదన జనం ముందు నిలబడలేకపోయింది. ఇక కొణతాల, వట్టి వసంత్ కుమార్, నాదెండ్ల మనోహర్ మాత్రమే కాదు సాక్షాత్తు pcc అధ్యక్ష పీఠం మీద కూర్చున్న రఘువీరా, కాంగ్రెస్ హయాంలో సీఎం కుర్చీ లో కూర్చున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు రాజకీయాల్ని చిటికిన వేలున నడిపించిన ఈ నాయకులంతా అదే స్థానంలో, అదే పార్టీ లో నిస్సహాయులుగా మిగిలిపోవడం చూస్తుంటే కాలం ముందు ఎంతటివారైనా తల వంచాల్సిందే అనిపిస్తోంది. కనీసం కేంద్రంలో అయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీరికి రాజకీయ అజ్ఞాతవాసం నుంచి విముక్తి లభిస్తుందేమో పాపం.