ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు..వాళ్ళు ఎన్నుకున్నవాడే నాయకుడు. ఇదంతా తెలిసి కూడా కెసిఆర్ కోట అని అంటున్నారు అనే డౌట్ రావడం సహజం. కానీ తెలంగాణ సీఎం కెసిఆర్ చుట్టూ బలమైన కోట ఉన్నమాట నిజం. ఆ కోటకి కెసిఆర్ , కేటీఆర్, హరీష్ రావు , కవిత నాలుగు స్తంభాలు. కెసిఆర్ వ్యూహ చతురత , వాగ్ధాటి ఆ కోటకి పునాది. వీటి మధ్య కెసిఆర్ పదిలంగా వున్నారు. అదే ధైర్యంతో ఆయన ముందస్తుకు వెళ్లారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యూహాలు, ప్రజాభిప్రాయం వంటి కీలక అంశాల విషయంలో కెసిఆర్ మీద లేక తెరాస ప్రభుత్వం మీద కొందరికి అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఆ లోపాల్ని తట్టుకుని నిలబడే శక్తి మాత్రం కెసిఆర్ చుట్టూ దిట్టమైన కోట వల్లే వస్తోంది.
ప్రేమ , యుద్ధంలో ఏది తప్పు కాదు అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకుని ఇప్పుడు ఆ కోటగోడని బద్దలు చేయడానికి మహాకూటమి, మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు 10 జన్ పద్ వర్గాలు గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. కెసిఆర్ వ్యూహ చతురత , వాగ్ధాటి విషయంలో ఏం చేసినా ప్రయోజనం లేదన్న విషయం 2014 ఎన్నికలతోటే బోధపరుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు నాలుగు స్థంభాల్లాంటి నాయకుల మీద ఫోకస్ పెట్టినట్టుంది. కెసిఆర్ సంతానం కేటీఆర్ , కవిత మీద దృష్టిపెట్టిన ఆ పార్టీ నాయకులు వారి తప్పులకు ఏదైనా గట్టి ఆధారం దొరుకుతుందేమో అన్న ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. హరీష్ విషయంలోనూ కొందరు అధికారుల లోపాయికారీ సాయంతో కొన్ని ప్రయత్నాలు సాగినా ఏ ఉపయోగం లేకుండా పోయింది.
అయినా ఆగకుండా హరీష్ , కేటీఆర్ ల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తుల్ని ప్రయోగించారు. అవి ఉపయోగ పడలేదు సరి కదా కెసిఆర్ తో పాటు ఆయన రాజకీయ కోటకి స్థంభాల్లాంటి వాళ్ళు అప్రమత్తం కావడానికి దోహదం చేసింది. అందుకేనేమో సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ , హరీష్ నవ్వులు చిందిస్తూ తెరాస శ్రేణుల్లో హుషారు నింపితే , కాంగ్రెస్ కి కంటగింపుగా మారింది. ఏదేమైనా ప్రజాక్షేత్రం నుంచి కెసిఆర్ ని దెబ్బకొట్టడం కష్టమని తలచి ఆయన చుట్టూ వున్న కోటలో చిచ్చు పెట్టేందుకు ఏ దారి దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆ దారి దొరికే ఛాన్స్ కనిపించడమే లేదు పాపం.