Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెలోడీ బ్రహ్మ, మ్మూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరపింపచేస్తున్న ఇళయరాజాకు పద్మవిభూషణే కాదు..భారత రత్న ప్రకటించినా అది ఆయనకు దక్కే సముచిత గౌరవమే. కొన్ని అవార్డులు కొందరిని వరించడం వల్ల సార్థకత పొందుతాయి అన్నదానికి ఇళయరాజా సరైన ఉదాహరణ. విభేదాలను పక్కనపెట్టి మరీ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఇళయరాజాను వరించి పద్మవిభూషణ్ గుర్తింపు పొందింది అని బాలు చేసిన వ్యాఖ్య నూటికి నూరుపాళ్లూ నిజం. అయితే ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక మాత్రం ఇళయరాజాకు పద్మవిభూషణ్ ఇవ్వడంపై కోడిగుడ్డు మీద ఈకలు పీకే చందంగా ఓ కథనం వండి వార్చింది. దళిత్ ఔట్ రీచ్ విత్ ఇళయరాజాస్ పద్మ హెడ్ లైన్ తో ఆ పత్రిక కథనం ప్రచురించింది. పద్మ అవార్డుల్లో కులం పాత్ర ఉందన్నట్టుగా…ఇళయరాజాకు ఆ కోణంలోనే పద్మవిభూషణ్ దక్కినట్టుగా ఉన్న ఆ కథనంపై పాఠకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళయరాజా ప్రతిభను కులంతో ముడిపెడతారా అని మండిపడ్డారు. కులాన్ని చూసి ఇళయరాజాను భారత ప్రభుత్వం సత్కరించిందా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆ పత్రిక స్పందించింది. ఇళయరాజాను అగౌరవపర్చడం తమ ఉద్దేశం కాదని, అలాంటి హెడ్డింగ్ పెట్టడంపై క్షమాపణ తెలియజేస్తున్నామని ప్రకటించింది.