మొత్తం 1,853,155 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 423,554 మంది కోలుకున్నారు. మరో 1.26 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 50,900 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా అమెరికాలో మృతుల సంఖ్య 22 వేలు దాటింది. బాధితుల సంఖ్య 5.6 లక్షలకుపైగా నమోదైంది. అమెరికాలో కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చేరే ప్రతి 10 మంది మధ్య వయస్కుల్లో ఒకరు మృతిచెందుతున్నారని, 85 ఏళ్లు దాటినవారైతే ప్రతి పది మందిలో నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. మధ్య వయస్కులకూ ముప్పు పెరుగుతున్నట్లు దీనిద్వారా స్పష్టమవుతోంది.
అటు, రష్యాలోనూ కరోనా వేగం పెంచింది. గడచిన 24 గంటల్లోనే 2,186 కేసులు నమోదయ్యాయి. అందులో 1,306 మంది ఒక్క మాస్కోకు చెందినవారే. దీంతో రష్యాలో మొత్తం బాధితుల సంఖ్య 15,770కి పెరిగింది. ఇప్పటివరకు ఆ దేశంలో కొవిడ్ కారణంగా 130 మంది మరణించారు. స్పెయిన్‌లో శనివారం కాస్త తగ్గినట్లు కనిపించినా మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. ఆదివారం ఒక్కరోజే ఆ దేశంలో మరో 619 మంది మృత్యువాతపడ్డారు. ఇటలీలోనూ 24 గంటల్లో 619 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో శవపేటికల కొరత ఏర్పడుతోంది.
అమెరికాలో 560,433, స్పెయిన్‌లో 166,831, ఇటలీలో 156,363, ఫ్రాన్స్‌లో 132,591, జర్మనీలో 127,854, బ్రిటన్‌లో 84,279, చైనాలో 82,160, ఇరాన్లో 71,686, టర్కీలో 56,956, బెల్జియంలో 29,647, నెదర్లాండ్ 25,587, స్విట్జర్లాండ్ 25,415, కెనడా 24,383, బ్రెజిల్ 22,318, పోర్చుగల్ 16,587, రష్యా 15, 770, ఆస్ట్రియా 13,945, ఇజ్రాయెల్ 11,145, దక్షిణ కొరియా 10,537 మంది వైరస్ బారినపడ్డారు.
అమెరికాలో 22,115, స్పెయిన్ 17,209, ఇటలీ 19,899, ఫ్రాన్స్ 14,293, బ్రిటన్ 10,612, ఇరాన్ 4,474, బెల్జియం 3,600, చైనా 3,341, జర్మనీ 3,022, నెదర్లాండ్ 2,737, బ్రెజిల్ 1,230, టర్కీ 1,198, స్విట్జర్లాండ్ 1,106, స్వీడన్ 899, కెనడా 717, పోర్చుగల్‌లో 504 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ బారిన పడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దాదాపుగా కోలుకున్నారు. లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రి నుంచి ఆయన ఆదివారం డిశ్ఛార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.