Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తల్లీ బిడ్డల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. బిడ్డకు ఏ చిన్న ఆపద వాటిల్లినా తల్లి తట్టుకోలేదు. బిడ్డ పరిస్థితి చూసి విలవిల్లాడిపోతుంది. బిడ్డ కన్నా ఎక్కువగా ఆ బాధ తాను అనుభవిస్తుంది. తల్లీ బిడ్డల మాతృబంధం ఒక్క మనుషులకే పరిమితం కాదు. సృష్టిలోని ప్రతిప్రాణి లోనూ ఈ అనుబంధం కనపడుతుంది. .జంతువులు, పక్షులు కూడా తమ బిడ్డలకు మాతృప్రేమను పంచుతాయి. మూగజీవాలు బిడ్డలపై కనబరిచే ప్రేమ చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఆవు, గేదె, కుక్క, పిల్లి, కోడి వంటి మూగజీవాలు… పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా రక్షించుకుంటాయి. తమ వెంట పిల్లలు ఉన్నప్పుడు ఈ మూగజీవాలు ఎవరినీ వాటి దగ్గరకు రానివ్వవు. పిల్లి తన పిల్లలను రక్షించుకోవడం కోసం ఏడు ఇళ్లు మారస్తుందని చెబుతారు.
కుక్క… అనుక్షణం తన పిల్లలకు కాపలా ఉంటుంది. గేదె, ఆవు వంటి జంతువులు వాటి పిల్లల దగ్గరికి వెళ్లబోతే కొమ్ములతో కసితీరా పొడుస్తాయి. కాకి, పిచ్చుక వంటి పక్షులు కూడా తమ గూట్లో ఉన్న పిల్లల చెంత ఎవరన్నా వస్తే… తమ ముక్కులతో పొడిచి గాయాలు చేస్తాయి. ఇలా పశుపక్షాదులు కూడా మనుషుల్లానే పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమాభిమానాలు కనబరుస్తాయి. ఇదే తరహాలో ఓ మూగజీవి తన తల్లి ప్రేమను చాటి వార్తల్లో నిలిచింది. తమ పిల్లలకు ఏదన్నా బాధ కలిగితే తట్టుకోలేక మూగజీవాలు ఎంతలా విలవిల్లాడిపోతాయో కర్నాటకలో జరిగిన ఈ ఘటన తెలియజేస్తోంది. తల్లి ప్రేమ అన్ని ప్రాణుల్లోనూ ఒకటే అని రుజువుచేస్తున్న ఓ గోవు కథ ఇది. హవేరీ ప్రాంతంలోని ఓ రెండు నెలల లేగదూడకు ఇటీవల గాయమైంది. కాలిగాయం కారణంగా ఆ దూడకు ఇన్ ఫెక్షన్ సోకింది. దీంతో ఆ దూడ నడవలేక నీరసించిపోయింది.
అపస్మారకస్థితిలోకి వెళ్లిన దూడను చూసి తల్లి ఆవుకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆ దూడ దగ్గరే దీనంగా కూర్చుంది. దూడ స్థితిని చూసి బాధతో విలవిల్లాడిపోయింది. అయితే దూడ పరిస్థితి గమనించిన యజమాని చికిత్స నిమిత్తం దాన్ని ఓ ట్రాలీలో ఎక్కించి సమీపంలోని వెటర్నరీ ఆస్పత్రికి బయలుదేరాడు. దూడను యజమాని ఆటోలో తీసుకెళ్తోంటే తల్లి ఆవు ఆ ఆటో వెంట పరుగెత్తుకుంటూ వెళ్లింది. దాదాపు అర కిలోమీటర్ దూరం ఉన్న ఆస్పత్రి వరకు తల్లి ఆవు అలా ఆటో వెంట పరిగెత్తింది. ఆటో వేగంతో పోటీపడుతూ ఆవు అలా తనదూడ కోసం పరుగెత్తుతున్న దృశ్యం అందరినీ కదిలించివేసింది. వెటర్నరీ ఆస్పత్రిలో దూడకు చికిత్స జరుగుతున్నంత సేపూ ఆవు అక్కడే ఉంది. ఆస్పత్రి గేట్ వద్ద దీనంగా దూడ కోసం ఎదురు చూస్తూ నిల్చుంది. చికిత్స అనంతరం గాయం నయమై లేగదూడ కోలుకున్న తర్వాత… ప్రేమకు బిడ్డను నిమురుతూ సంతోషపడింది గోమాత.