Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలకు అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈసారి అధికార , విపక్షాలతో పాటు జనసేన కూడా రంగంలోకి దిగుతుందని తేలిపోవడంతో రాజకీయ సమీకరణాలు ఎలా వుంటాయో అంతు బట్టకుండా వుంది. ఇక కేంద్రం ఓ అడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజనకు సై అంటే రాజకీయ నాడి పట్టుకోవడం అంత తేలిక కాదు. ఈ పరిస్థితిని అంచనా వేసుకుని ఎన్నికల పొత్తుల మీద ప్రధాన పార్టీలు దృష్టి పెడుతున్నాయి. పొత్తులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వామపక్షాలు. ఈసారి ఎర్ర జెండాలు ఎవరితో కలిసి ఎగురుతాయి ? .
వామపక్షాలతో పొత్తు కోసం వైసీపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. కమ్యూనిస్టులు క్షేత్ర స్థాయిలో చేసే పోరాటాలకు వైసీపీ శ్రేణులు మద్దతు ఇవ్వడం చూస్తూనే వున్నాం. ప్రకాశం జిల్లా , పర్చూరు నియోజకవర్గం, దేవరపల్లి భూముల వ్యవహారం ఇందుకు ప్రబల ఉదాహరణ. అయితే దానికి తగ్గట్టు రాజకీయ సమీకరణాలు ఉండడం లేదు.
వచ్చే ఎన్నికల్లో తమతో కలిసిపోవాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు వామపక్షాలు రెడ్ సిగ్నల్ వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకుముందు సిపిఐ వైసీపీ ని వ్యతిరేకిస్తుంటే , సిపిఎం కాస్త సానుకూల ధోరణి ప్రదర్శించేది. ఎప్పుడైతే జనసేన అనే ఇంకో ప్రత్యామ్న్యాయం కనిపించిందో అప్పటి నుంచి క్రమంగా సిపిఎం వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. CPI ఇప్పటికే జనసేనతో ముందుకు వెళతామని చెప్తుంటే తాజాగా సిపిఎం సైతం అదే దారిలో నడవడానికి రెడీ అవుతోంది. వామపక్షాల తాజా ఆలోచనతో వైసీపీ బాగా హర్ట్ అయ్యింది. తమకు రెడ్ సిగ్నల్ , జనసేనకు గ్రీన్ సిగ్నల్ వేస్తున్న ఎర్ర పార్టీల మీద ప్రైవేట్ సమావేశాల్లో వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.