Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో ఎవరికి ఎక్కడ ఏ లింక్ వుందో… ఎక్కడ లంకె వుందో చెప్పడం కష్టం. బద్ధశత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయని వై.ఎస్ హయాంలోనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో బీజేపీ శాసనసభ పక్ష నేతగా పనిచేసిన కిషన్ రెడ్డి గెలుపులో వై.ఎస్ హస్తముందని ఆయన మీద ఓడిపోయిన వి.హనుమంతరావు ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డికి వై .ఎస్ ఆర్ధిక సాయం చేశారని కూడా వి.హెచ్ అన్నారు. ఇందులో నిజానిజాలేమిటో గానీ అప్పట్లో పెద్ద సంచలనం. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణే ఒకటి బయటకు వచ్చింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుకి సంబంధించి కొన్ని కీలక ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. మధు వైసీపీ కోవర్ట్, జగన్ బంధువన్నది ఆ ఆరోపణల సారాంశం.
గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలం, గొరిజవోలు గ్రామంలో ప్రభుత్వ చెరువు భూమిని ఎప్పటినుంచో దళితులు సాగు చేసుకుంటున్నారు. 152 ఎకరాల ఆ భూమికి సంబంధించి ఓ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆ భూమి సర్వే, ఇతర వివరాలు ఇవ్వాలని రెవిన్యూ అధికారులకి ఉత్తర్వులిచ్చింది. ఆ పని మొదలవడంతో దళితులు భయపడిపోయి స్థానిక ఎమ్మెల్యే , మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ని కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఎప్పటినుంచో తమ సాగులో వున్న భూమి తమకు కాకుండా పోతుందని ఆవేదన చెందారు. మంత్రి వారికి ఏ అన్యాయం జరక్కుండా చూస్తానని మాటిచ్చారు. అయితే మంత్రి హస్తంతోనే ఇదంతా జరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గొరిజవోలు వెళ్లి నానా హంగామా చేశారు. దీనిపై స్పందించిన స్థానిక టీడీపీ నేతలు మధు ఈ వ్యవహారంలో ఇంత చొరవ ఎందుకు చుపిస్తున్నారో ఆరా తీసారట. ఆ ఆరాలో వైసీపీ కోవర్ట్ గా మధు సూధన్ రెడ్డి ఉరఫ్ మధు పనిచేస్తున్నట్టు తేలిందట. పైగా వైసీపీ అధినేత జగన్ తో మధుసూదన్ రెడ్డి కి బంధుత్వం కూడా ఉందట. ఇందులో నిజం ఎంతుందో గానీ టీడీపీ నేతల ఆరోపణలు సిపిఎం లో కలకలం రేపుతున్నాయి.