టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 33వ బర్త్‌డే

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 33వ బర్త్‌డే

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 33వ బర్త్‌డేలో భాగంగా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) శుభాకాంక్షలు తెలియజేసింది. ఈరోజు (ఏప్రిల్‌ 30) హిట్‌ మ్యాన్‌గా పిలవబడే రోహిత్‌ శర్మ తన జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నాడు. హిట్‌ మ్యాన్‌కు స్పెషల్‌ డే అంటూ బీసీసీఐ అభినందనలు తెలిపింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడటంతో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లతో బర్త్‌ డేను సెలబ్రేట్‌ చేసుకునే అవకాశం రోహిత్‌కు దక్కలేదు. ఈసారి ఇంట్లోనే భార్య-కూతురితో కలిసి రోహిత్‌ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నాడు.

2007లోనే భారత జట్టులో అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మకు ఆదిలో తన స్థానంపై భరోసా ఉండేది కాదు. ఆడప దడపా అవకాశాలతో అలా నెట్టికొచ్చిన రోహిత్‌.. 2013 నుంచి జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. ఆ ఏడాది భారత జట్టు చాంపియన్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ హిట్‌ మ్యాన్‌గా మారిపోయాడు. తన ఆటను విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పి వారితోనే ప్రశంసలు అందుకున్నాడు. అతని కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించిన రోహిత్‌.. ప్రస్తుతం టీమిండియా కీలక ఆటగాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ ఘనత రోహిత్‌ది.