కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన చింతూరు మండలం బొడ్డుగూడెం ఆశ్రమ పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. మొత్తం 39 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో పప్పు, బంగాళ దుంపల కూరతో భోజనాన్ని వడ్డించారు. సాయంత్రం ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వీరికి పెరుగు ఇచ్చారు. ఇది తాగిన కొంత సమయానికి కొంతమంది వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు వీరిని ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యురాలు విశ్వ చైతన్య ఆ వెంటనే ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అక్కడి సిక్ రూంలో మరికొందరు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతో ఉండటాన్ని గమనించి వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 16 మందిని మెరుగైన వైద్యానికి చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా ఉప వైద్యాధికారి పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.