తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం తో ఓ యువకుడిపై, అతని తల్లిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబట్పల్లి గ్రామానికి చెందిన నల్ల అవినాష్కు తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అదే గ్రామానికి చెందిన నర్సింహ అనుమానం పెంచుకున్నాడు. బుధవారం ఉదయం శివాలయం సమీపంలో అవినాష్పై నర్సింహ గొడ్డలితో దాడి చేశాడు.
గాయపడిన అవినాష్.. అతడి బారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం అవినాష్ ఇంటికి వెళ్లిన నర్సింహ.. అతడి తల్లి నల్ల పద్మ(45)పై విచక్షణరహితంగా దాడి చేశాడు. అక్కడే కుప్పకూలిన పద్మను స్థానికులు, బంధువులు మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పద్మ భర్త భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు మహాదేవపూర్ సీఐ కిరణ్, ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.