తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఒంగోలులో దాడి జరిగింది. జిమ్స్ వైద్యశాల నిర్వాహకుడు డాక్టర్ రామచం ద్రారెడ్డి, ఆయన అనుచరుడు బాలు ఇనుపరాడ్లతో ఆయనను విచక్షణారహితంగా కొట్టారు. ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ రామచంద్రారెడ్డి మరికొందరి భాగస్వామ్యంతో ఒంగోలులో జిమ్స్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఒక భాగస్వామి. విభేదాలు తలెత్తడంతో పలువురు భాగస్వాములు తమ వాటాలు తీసుకుని వెళ్లిపోయారు. శ్రీనివాసరెడ్డి సైతం తన వాటా వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో.. రామచంద్రారెడ్డితో వివాదం ఏర్పడింది.
వాటా డబ్బు ఇస్తాం మంగళవారం ఆసుపత్రికి రమ్మని పిలిచారు. ఆ విషయమై చర్చిస్తుండగా డాక్టర్ రామచంద్రారెడ్డి, ఆయన సహాయకుడు బాలు ఇనుప రాడ్లతో దాడి చేయడంతో శ్రీనివాసరెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. అతికష్టం మీద వారి నుంచి తప్పించుకుని బయటపడ్డ బాధితుడు స్థానికుల సహకారంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తెదేపా పక్షాన వివిధ చర్చా వేదికల్లో బలమైన వాణి వినిపించే తమ నాయకుడిపై హత్యాయత్నం జరిగిందన్న వార్తతో జిల్లాలో తెదేపా శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. చికిత్స పొందుతున్న ఆయనను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా నాయకులు పరామర్శించారు. శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం చేసిన రామచంద్రారెడ్డి, ఆయన సహాయకుడు బాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. బాధితుడు కోలుకుంటున్నారని చెప్పారు.