Crime: బాలికకు వాలంటీరు వేధింపులు.. తట్టుకోలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం

Crime: Girl was molested by a volunteer.. Unable to bear it, she drank rat poison and attempted suicide
Crime: Girl was molested by a volunteer.. Unable to bear it, she drank rat poison and attempted suicide

‘మీ అక్కని తీసుకురా.. లేకపోతే నువ్వు రా.. మాదే ప్రభుత్వం .. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని ఓ వాలంటీరు బాలికను వేధించాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రమవడంతో ఆ బాలిక(13) ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని ఓ గ్రామంలో పిట్టు శ్రీకాంత్రెడ్డి(25) వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ విద్యార్థినికి పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో సీటు వచ్చింది. ఆమె రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో విద్యాదీవెన, తదితర పథకాల కోసం ఓటీపీ చెప్పాలని వాలంటీరు.. విద్యార్థిని ఫోన్ నంబరు తీసుకున్నాడు.

అప్పటినుంచి ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. నంబరు బ్లాక్ చేసినా వేర్వేరు నంబర్లతో ఫోన్ చేసేవాడు. అంతటితో ఆగకుండా ఆమె చెల్లెలు వెంటపడ్డాడు. మీ అక్కను తీసుకురా, లేకపోతే నవ్వు రా అంటూ వేధించాడు. ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు వాలంటీరు ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. అయినా సరే మం గళవారం మళ్లీ బాలిక వెంట పడగా ఆమె ఎలుకల మందు తాగింది. అలాగే పాఠశాలకు వెళ్లి వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు వాలంటీరుపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు వాలంటీరు వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, గ్రామంలో పెద్దలకు చెప్పినా తమనే బెదిరిస్తున్నారని బాధితురాలి మేనమామ వాపోయారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని నరసరావుపేట గ్రామీణ పోలీసులు తెలిపారు.