వైకాపా అధికారంలోకి వచ్చిన తరవాత ఎటువంటి అభివృద్ధీ జరగలేదని, నెల రోజులుగా తన ఇంటి పక్కనే నీరు నిలిచినా తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించడమే అతను చేసిన తప్పు .. ఇలా అన్నందుకు ఆ వ్యక్తిపై వైకాపా నేతలు రాళ్లతో దాడి చేశారు. తిరుపతి జిల్లా డక్కిలి ప్రాంతానికి చెందిన శంకరయ్య ఇంటి పక్కనే నెల రోజులుగా నీళ్లు నిలిచిపోయాయి. అధికారులకు చెప్పినా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో పక్కనే ఉన్న వైకాపా నేత దేవుడిఎల్లంపల్లి ఆలయ ట్రస్టు సభ్యుడు శ్రీనివాసులు, అతని సోదరుడు వైకాపా నేత బాలకృష్ణలు శంకరయ్య కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తావా అంటూ రాళ్లతో దాడికి దిగారు. శంకరయ్య తలకు తీవ్ర గాయమైంది. ఆయనతోపాటు భార్య గౌరీ బంధువులు తెదేపా బూత్ కమిటీ కన్వీనర్ శ్రీహరి, వేముల తులసి, అనసూయమ్మలకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడు శంకరయ్యకు స్థానిక ఆసుపత్రిలో కుట్లు వేశారు. గాయాలపాలైన ఆయన భార్య, కుటుంబ సభ్యులకు చికిత్స చేశారు. శంకరయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.