అనంతపురంలో పట్టపగలే దొంగలు దోపిడీకి దిగారు. బ్యాంకులో నగదు జమ చేయడానికి వెళ్లిన వ్యక్తిపై కారం చల్లి నగదును ఎత్తుకెళ్లారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరంలోని ఎర్రనేలకొట్టాలకు చెందిన పోతురాజు అనే వ్యక్తి ఓ నగదు రవాణా ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఎల్ఐసీకి చెందిన రూ.46 లక్షలను బ్యాగులో పెట్టుకుని ఓ బ్యాంకులో జమ చేయడానికి బయలుదేరాడు. భవనంలోని మూడో అంతస్తులో ఉన్న బ్యాంక్కు మెట్ల ద్వారా వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు పోతురాజు కళ్లలో కారం కొట్టి నిరుపయోగంగా ఉన్న నాలుగో అంతస్తులోకి ఈడ్చు కెళ్లారు. నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు, చేతులు కట్టి పడేసి అతడి వద్ద ఉన్న బ్యాగ్తో ఉడాయించారు. నగదు జమ చేయడానికి వెళ్లిన ఉద్యోగి బ్యాంక్కు వెళ్లకపోవడం, ఫోన్కు స్పందించకపోవడంతో సహచర ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పోతురాజుని గుర్తించిన బ్యాంకు ఉద్యోగి ఒకరు.. పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి బాధితుణ్ని తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.